♦ పూర్తిగా పడిపోయిన టమాటా ధర
♦ కొనేవారు లేక చేను వద్దే పడేస్తున్న వైనం
మెదక్ రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన టమాటా అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. కనీసం పెట్టిన పెట్టుబడి కాదుకదా? రవాణా ఖర్చులు కూడా గిట్టుబా టు కాకపోవడంతో పొలం వద్దే పడేస్తున్నారు. దీంతో ఎకరం పొలంలో టమాటా పంట సాగుచేసిన రైతులకు అప్పులే మిగులుతున్నాయి. నాలుగు నెలల క్రితం కిలో టమాటా ధర రూ. 40 నుంచి 50ల వరకు పలికింది. దీంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మెదక్ మండలంలో సుమారు 100 ఎకరాల్లో పంట వేశారు. ఒక్కో ఎకరానికి రూ.10 నుంచి 15 వేల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట దిగుబడి చేతికొచ్చింది. అయితే మార్కెట్‌లో ధర అమాంతం పడిపోయింది. కిలో రూ. 3 నుంచి రూ. 5కు పడిపోయింది.
దిగుబడిని మార్కెట్‌కు తరలించాలంటే గంపకు రూ. 20 నుంచి 30 ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో విక్రయించగా వచ్చే డబ్బులు రూ. 50కి మించడం లేదు. దీంతో మార్కెట్‌లోకి తరలించి విక్రయిస్తే లాభం మాట దెవుడెరుగు, రవాణా ఖర్చులు రావడం లేదని పొలం వద్దనే పడేస్తున్నారు. మెదక్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు రాధాకిషన్ అనే తన ఎకరా పొలంలో రూ. 15 వేలు పెట్టుబడి పెట్టి టమాటా సాగుచేశారు. కాగా మార్కెట్‌లో ఒక్కసారిగా టమాట ధర భారీగా పడిపోవడంతో టమాటాలు తెంపి పొలం వద్దే పడేశాడు. తనకు అప్పులే మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మండల రైతులు టమాటా సాగు చేసి పెద్ద ఎత్తున నష్టపోయారు.