హరితహారం టార్గెట్ పూర్తి చేయాలి
-
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా కేటాయించిన టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో బుధవారం రాత్రి ఎంపీడీఓలతో హరితహారంపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జఫర్‌గఢ్ వంటి మండలాలు 90 శాతం లక్ష్యాన్ని సాధిస్తే అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు మొక్కల పెంపకంలో ఎందుకు వెనకబడుతున్నాయని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సెలవులు, పండుగ రోజుల్లో కూడా మొక్కలు నాటాలని సూచించారు. ఇకపై ప్రతి రోజు సాయంత్రం ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.
కాగా, హరితహారం లక్ష్యసాధనలో పూర్తిగా వెనకబడిన తాడ్వాయి, గణపు రం ఎంపీడీఓలకు చార్జ్ మెమోలు ఇవ్వాలని జెడ్పీ సీఈఓను.. కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శ్రీనివాస్, సీపీఓ రాంచందర్‌రావు, సీఈఓ విజయగోపాల్, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.