'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు' | tdp and chandra babu naidu is oppressing all including junior ntr, says mla roja | Sakshi
Sakshi News home page

'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు'

Published Tue, Mar 29 2016 11:54 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు' - Sakshi

'జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు'

ఎన్టీఆర్‌ను గానీ, ఆ పేరును గానీ ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసిన సందర్భంగా ఆమె కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్  ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. ఎన్టీఆర్‌ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈయన మాత్రం కాంగ్రెస్‌తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు. అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు.

ఎన్టీఆర్‌ను ప్రజలు గుర్తుపెట్టుకోవడం బాబుకు ఇష్టంలేదని, ఆయన పేరు చూస్తేనే బాబుకు కక్ష అని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాలను గుర్తించి ఇక ముందు కూడా ఈ చంద్రబాబు పార్టీలో కొనసాగుతారా.. లేదా ఆయన్ను తరిమేసి ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతారో చూడాలని అన్నారు. ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. ఈ గ్యాంగు తనను తొక్కేయాలని చూస్తోందన్నారు.

చంద్రబాబు అడ్డదిడ్డంగా తన నాయకులను కాపాడుకోవడం కోసం కాల్‌మనీలో మహిళలు అన్యాయమైపోతున్నా పట్టించుకోవట్లేదని, ఇది 3 కోట్ల మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపై చర్చించాలని ప్రొటెస్ట్ చేశాం తప్ప ఎవరిమీదా తనకు వ్యక్తిగత ద్వేషం లేదని రోజా తెలిపారు. ఆరోజు అందరూ నిరసన వ్యక్తం చేస్తే.. ఒక్క తనమీద మాత్రమే చర్య తీసుకున్నారని గుర్తుచేశారు. తాను కామ సీఎం అనడం వల్ల సస్పెండ్ చేసినట్లు యనమల రామకృష్ణుడు చెప్పారని, కానీ నిజానికి ఐదు రోజుల పాటు పేపర్లన్నింటిలో ఇదే విషయం వచ్చిందని, దానిమీదే తాను వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు ఒత్తిడి చేశానని చెప్పారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళల సంక్షేమం కోసం కట్టుబడ్డానని, రిషితేశ్వరి, వనజాక్షి, అంగన్‌వాడీల విషయాన్ని లేవనెత్తాను కాబట్టి అణిచేస్తున్నారని అన్నారు.

చివరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా రాక్షసంగా అడ్డుకున్నారని చెప్పారు. తమకు నచ్చిన చానల్‌కే రికార్డింగ్ హక్కులు ఇచ్చి, తమకు నచ్చిన అంశాలనే ప్రసారం చేయిస్తున్నారంటే వాళ్ల దిగజారుడు రాజకీయాలు గమనించాలని అన్నారు. 18వ తేదీనాటి విషయం గురించి  ఐదు రోజుల తర్వాత అనితను ఏడ్పించి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు .డివిజన్ బెంచి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేస్తున్నానని, తీర్పు కాపీ అందడం ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు రాలేకపోయానని అన్నారు. తనకు మరో అవకాశం ఇస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారే గానీ ఇంతవరకు ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలిచిన పాపన పోలేదని ఆమె తెలిపారు. సోమవారం వరకు ఎదురుచూసినా ఆ కమిటీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చానని చెప్పారు. మహిళలను వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement