ధర్మవరంలో టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రైల్వేస్టేషన్‌లో వడలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులపై ప్రతాపం చూపిస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు.
రైల్వే క్యాటరింగ్ కార్మికుడిపై హత్యాయత్నం
ధర్మవరం : ధర్మవరంలో టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. రైల్వేస్టేషన్‌లో వడలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులపై ప్రతాపం చూపిస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. గురువారం రోజున రైల్వే క్యాటరింగ్‌కార్మికులపై దాడి చేసి, క్యాంటీన్‌ను ధ్వంసం చేసి ఒక రోజు కూడా గడవకనే మరోసారి దాడులకు తెగబడ్డారు. తాజాగా శుక్రవారం ఉదయం రోజు కూలి నిమిత్తం ధర్మవరం మండలం బడన్నపల్లి నుంచి రైల్వేస్టేషన్‌కు బయలు దేరి వస్తున్న క్యాటరింగ్ కార్మికుడు రామాంజనేయులును మార్గంమధ్యలో తారకరామాపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు అటకాయించి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
స్థానికులు ప్రతిఘటించడంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును స్థానికులు ఆటోలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు, భుజానికి తీవ్రగాయాలయ్యాయని, రక్తస్రావం అ«ధికంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు టీడీపీ నాయకుడు కొత్తపేట ఆదితో పాటు ఆది, శేఖర్, మంజు, వెంకటేశ్, హరీష్, రషీద్, సూరీలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు మాట్లాడుతూ కొత్తపేట ఆదితో పాటు అతని అనుచరులు రైల్వేస్టేషన్‌లో తనతో పాటు ఇతర కార్మికులను పని చేయవద్దని, చేస్తే చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపాడు. వారి నుంచి రక్షించాలని వేడుకున్నాడు.