‘పచ్చ’మార్కు అక్రమం | TDP leaders correption | Sakshi
Sakshi News home page

‘పచ్చ’మార్కు అక్రమం

Published Sun, Jul 24 2016 9:46 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

TDP leaders correption

సాగు భూమిని దౌర్జన్యంగా తవ్వేసిన తెలుగు తమ్ముళ్లు   
‘మా భూమి’ అంటూ బాధితులు గగ్గోలు పెట్టినా ఎవ్వరికీ పట్టని వైనం 
కోర్టు జోక్యంతో ఆగిన అక్రమం 
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది 
 
 
కష్టార్జితంతో కొన్న భూమిని సాగు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న జీవితాలపై అక్రమార్కుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని ఆ భూమిలో మట్టి తవ్వకాలు చేసేశారు. పట్టెడన్నం పెట్టే నేల తల్లిని గుల్ల చేస్తుంటే చూడలేని రైతు కనిపించిన అధికారినల్లా.. ‘మా భూమి’ సారూ.. అంటూ కాళ్లావేళ్లా పడ్డారు. అయితే ఆ రైతు గుండెఘోష ఎవ్వరికీ పట్టలేదు. న్యాయదేవతకే చెప్పుకుంటానని కోర్టు మెట్లెక్కాడు. హైకోర్టు మొట్టికాయలతో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేల తల్లిని నిలువునా తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. రైతుకు వేదన మిగిల్చారు.    
 
 
చిలకలూరిపేట టౌన్‌ : మట్టి, ఇసుక, అసైన్డ్‌ భూములు కావేవీ దోపిడీకి అనర్హం అంటున్నారు అధికార పార్టీ నాయకులు. రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గి, ఆమ్యామ్యాలపై ఆశతో మటì ్ట దోపిడీకి సహకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ మట్టి దందాకు అంతేలేకుండాపోతోంది. బాధితులు తమ హక్కుల కోసం నాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 
రెవెన్యూ రికార్డులు వెతికి మరీ..  
దశాబ్దాల నాడు పంపిణీ చేసిన చెరువు పోరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌గా ఉందన్న సాకుతో సాగు భూమిలో మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం వారికి దక్కే వాటాల కోసం ఈ తతంగానికి తమ వంతు సహాయం అందజేస్తున్నారనటానికి ఇటీవల వెలుగుచూసిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామ సర్వే నంబర్‌ 52లో గోపాళంవారికుంటకు చెందిన 4.08 ఎకరాల భూమిని 1951లో ఆర్మీలో పనిచేసి చనిపోయిన వ్యక్తి భార్య జెల్లుడు దీనమ్మకు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూమి సాగులో ఉంది. ఆమె తదనంతరం ఆమె వారసులైన కుమార్తె దేవసహాయమ్మ ఆ భూమిని దశలవారీగా విక్రయించింది. వివిధ విక్రయాల అనంతరం చివరగా ఈ భూమి చుండి తిరుపతయ్య 1.04 ఎకరాలు, ఆయన భార్య చుండి పార్వతివర్ధని పేరున 3.04 ఎకరాలు కొని సాగు చేసుకుంటున్నారు. వారిపేరునే అడంగల్, పాసు పుస్తకాలు, శిస్తులు ఉన్నాయి. ఈ భూమిపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌ భూమిగా ఉందంటూ సుమారు రెండు నెలల కిందట తవ్వకాలు చేపట్టి మట్టి విక్రయాలకు దిగారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేకపోవడంతో చివరకు బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో పొందారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిత్యం పచ్చగా ఉండే పంట భూమి తవ్వి గుంట చేశారు.  
కోర్టు తీర్పుకు విరుద్ధంగా.. 
అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల వివాదం విషయంలో 2015 డిసెంబర్‌లో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 1954 జూన్‌ 18వ తేదీకి ముందు అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు సంబంధిత భూమి రెవెన్యూ అధికారులు ప్రకటించిన నిషేధిత జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారి నుంచి రిజిస్ట్రేషన్‌ అధికారి వివరణ కోరాలి. సకాలంలో సమాధానం రాకుంటే భూమిని రిజిస్ట్రేషన్‌ చేయవచ్చు. దీని ప్రకారం 1951లో పంపిణీ చేసిన యడవల్లి గ్రామ సర్వే నంబర్‌ 52లో గోపాళంవారికుంటకు చెందిన భూమిని అసైన్డ్‌ భూమి అంటూ తవ్వటం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమే అవుతుంది. 
మట్టి తవ్వకాలు ఆపాం..  
ఈ విషయమై చిలకలూరిపేట తహసీల్దార్‌ పీసీహెచ్‌ వెంకయ్యను సాక్షి వివరణ కోరగా నీరు–చెట్టు కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, రికార్డుల్లో అసైన్డ్‌ భూమి అని ఉండటంతో తవ్వకాలు చేశారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిపివేయించామన్నారు.
 
నష్టపరిహారానికి దావా వేస్తాం : చుండి తిరుపతయ్య 
నా పేరున, నా భార్య పేరున ఉన్న భూమిని మట్టి కోసం తవ్వబోతున్నారని తెలుసుకొని తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టా ఇచ్చింది తమ రికార్డుల్లో లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తవ్వకాలను ఆపే ప్రయత్నం చేయకపోవటంతో హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో పొందాను. మా భూములు తవ్వటంతో జరిగిన నష్టానికి  పరిహారం కోరుతూ కోర్టులో దావా వేస్తాను. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement