
పోటీ పడి మరీ నేతలు కునుకేశారు...
తిరుపతి : టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో నేతలు దర్జాగా కునుకేశారు. ఆవులింత అంటువ్యాధి అన్నట్లుగా తిరుపతి మహానాడులో నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు నిద్రలో జోగుతూ కెమెరాకు చిక్కారు. నిద్రాదేవి కరుణించడంతో వేదికపైనే నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు..... రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సహ మరో నేత ముందున్నారు. ఓవైపు నేతలు ప్రసంగిస్తుండగానే మరోవైపు వీరు మాత్రం హాయిగా నిద్రపోయారు.
ఇక ఇదే సీన్ శుక్రవారం నాటి మహానాడులో జరిగింది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప కూడా కునుకేశారు. వీరి వెనకే కూర్చున్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో మీడియా ప్రతినిధులు పోటీపడి మరీ చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.