
అందరి శత్రువయా!
⇒ బిగ్‌బాస్‌కు అందరితోనూ విభేదాలే..
⇒ సాగనంపాలంటూ ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే లేఖ
⇒ జిల్లా సమీక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం
⇒ నగదు రహిత రేషన్ పంపిణీపైనా విమర్శలు
⇒ సార్ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు సీరియస్
జిల్లాలో బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్న ఆ అధికారికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరితో విభేదాలు తెచ్చుకోవడం సాధారణమైంది. ఆయన తీరుపై ఉద్యోగ సంఘాలే కాదు... అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. జిల్లా సమీక్ష సమావేశాల్లో బిగ్‌బాస్ తీరును ఆ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు. అయితే చిన్నబాబు ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఇతర మంత్రులు ఏమీ చేయలేక ఎమ్మెల్యేలకు సర్దిచెబుతున్నారు.
సాక్షి, విజయవాడ : బిగ్‌బాస్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా విస్మరించారు. చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ను జిల్లా నుంచి సాగనంపాలంటూ టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే సమయంలో మరికొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిగ్‌బాస్‌పై మంత్రుల వద్ద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
► నగదు రహిత రేషన్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణాజిల్లాలో అమలు చేశారు. దీనివల్ల పేదలకు పూర్తిగా రేషన్ అందడం లేదు. మరోవైపు రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి తీవ్ర వత్తిడి రావడంతో రేషన్ దుకాణల్లో డిజిటల్ విధానానికి స్వస్తి పలకాలంటూ గత నెల 28వ తేదీన జరిగిన జిల్లాసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాలకు బదులుగా మద్యం షాపుల్లో ఈ విధానం పెట్టాలని సూచించారు.
► రాజధాని పేరుతో బిగ్‌బాస్ కొత్తకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా ఒక ఈవెంట్ మేనేజర్‌కే దక్కుతున్నాయి. ఆయనకు రూ.కోట్లలో బిల్లులు ఇస్తున్నారు. దీని వెనుక చిన్నబాబుకు, బిగ్‌బాబుకు వాటాలు అందుతున్నాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే చర్చిం చుకుంటున్నారు.
► జిల్లాలో ఒక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న పేదలు అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. భూసేకరణ సమాచారం తెలుసుకునేందుకు ఆ ఎమ్మెల్యే కీలక అధికారి అయిన బిగ్‌బాస్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఎమ్మెల్యే ఆ అధికారిపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
► విజయవాడలో అమరావతి ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన నగదు కోసం వాణిజ్య పన్నుల శాఖకు బిగ్‌బాస్ భారీగా టెండర్లు వేసి చందాలు వసూలు చేసి వ్యాపారులను వేధించారు. తాను నిర్వహించే ప్రతి సమావేశానికీ డెప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు రావాలని ఆదేశించే వారు. బిగ్‌బాబ్ వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు చేరింది. రాజధానిలో రెవెన్యూ పడిపోతే తాము బాధ్యత వహించబోమంటూ బిగ్‌బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఘాటుగా లేఖ రాశారు. తమ శాఖను ఉపయోగించి వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేయొ ద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
► విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చే పనులన్నింటినీ బిగ్‌బాసే పర్యవేక్షించారు. ఇందులో జరిగిన పనులకు ముందుగా అంచనాలు, టెండర్లు లేకపోవడంతో ఈఈ స్థాయి అధికారి బిల్లులు మంజూరు చేయబోమంటూ ఎదురు తిరిగారు. దీంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని ఆ ఈఈని మార్చి మరో ఈఈకి బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా బిల్లులు ఇప్పించారు. ఆ బిల్లుల్లో బిగ్‌బాస్‌కు రూ.లక్షల్లో మిగిలిందని ఇరిగేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
► వాస్తవంగా ప్రభుత్వశాఖల్లో బదిలీలను ఆ యా శాఖల ముఖ్య అధికారులే చేయాలి. అయితే బిగ్‌బాస్ జోక్యం చేసుకుని తన ఇష్టానుసారంగా బది లీలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగ సంఘాలు స్పందించి బదిలీల్లో బిగ్‌బాస్ జోక్యంపై తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు.
► జిల్లాలో సిబ్బందికి ఐదేళ్లకు ఒకసారి జరిగే రివైజ్డ్ పే స్కేల్స్‌కు కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలని బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉండటంతో ముందుకు సాగలేదు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన 12 జిల్లాల అధికారులు పాత సాఫ్ట్‌వేర్ ప్రకారం ఉద్యోగుల పేస్కేల్ మార్చారు. అయితే కృష్ణాజిల్లాలో మారకపోవడంతో చివరకు ఉద్యోగసంఘాలు జోక్యం చేసుకుని నిరసనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేయడంతో బిగ్‌బాస్ దిగి వచ్చారు. పాత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రివైజ్డ్ పేస్కేల్స్ తయారు చేయడానికి అంగీకరించారు.
► వివిధ కారణాలు వల్ల సస్పెండ్ అయిన వీఆర్‌వోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఈ బిగ్‌బాస్ వేధిస్తున్నారు. సుమారు 70 మంది వీఆర్‌వోలను పక్కన పెట్టడంతో రెవెన్యూ శాఖలో పాలన కుంటుపడింది.
► విజయవాడ దుర్గగుడి సమీపంలోని అర్జున వీధి ప్రారంభంలో ఉన్న కేంద్ర జలభవ¯న్‌ను తొలగించ వద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పుష్కరాల సమయంలో బిగ్‌బాస్ ఆ ఉత్తర్వులను లెక్క చేయకుండా భవనాన్ని కూల్చివేశారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖకు ప్రత్యామ్నాయం చూపించలేదని అప్పటి ఇరిగేషన్ ఎస్‌ఈ, ఈఈలపై బిగ్‌బాస్ తోకతొక్కిన తాచులాగా చిందులు తొక్కడంతో ఇరిగేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు.
► వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించినప్పుడు వారు చిన్నచిన్న తప్పులు చేసినా యూజ్‌లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అంటూ తిట్టడం బిగ్‌బాస్‌కు సర్వసాధారణం. సమావేశానికి రాకపోయినా, కొద్దిగా ఆలస్యంగా వచ్చినా, ఆయన చెప్పినట్లు చేయకపోయినా వారిపై విరుచుకుపడతారు.