వారికి నిరాశేనా? | tdp not given to new faces | Sakshi
Sakshi News home page

వారికి నిరాశేనా?

Published Fri, Feb 26 2016 2:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

వారికి నిరాశేనా? - Sakshi

వారికి నిరాశేనా?

కొత్త వారికి పదవులు రావంటున్న  తెలుగుదేశం పార్టీ వర్గాలు
తాజాగా ఆ పార్టీలో చేరినవారిలోనూ అంతర్మథనం
పబ్బం గడుపుకోవడానికే బాబు హామీలనే అనుమానాలు
బావ, తోడల్లుడు.. అందర్నీ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తూనే ఉన్నారు..

 
హైదరాబాద్: వారికి నిరాశేనా?... అవుననే  అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ధన ప్రలోభాలతో విపక్ష ఎమ్మెల్యేలకు ఎరవేసి, వారు పార్టీలో చేరుతున్న సమయంలో మంత్రి పదవులు ఇస్తానంటూ పార్టీ అధినేత హామీ ఇవ్వటాన్ని గమనిస్తున్న టీడీపీ నేతలు ఇది నిజమేనని అంటున్నారు. పార్టీలో చేరిన సుమారు అరడజను మందికి మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక పార్టీలో కొనసాగుతున్న అనేకమంది సీనియర్లకు సైతం అనేకమార్లు ఇదే తరహాలో మాటిచ్చారు. అయితే రాజ్యాంగం ప్రకారం అన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం లేదు. రాష్ర్ట శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 15 శాతం అంటే సుమారు 26 మందికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబుతో కలసి 20 మంది మంత్రులున్నారు. అంటే మరో ఆరుగురిని మాత్రమే కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తామని హామీనిచ్చిన ఆ పార్టీ నేతల్లో, ఆ పదవిని ఆశిస్తున్న వారిలో సోమిరెడ్డి, పయ్యావుల, ముద్దుకృష్ణమ, కళా వెంక ట్రావు, బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ్ల, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శివాజీ, దామచర్ల జనార్ధన్ తదితరులున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరిద్దర్ని మినహా ఎక్కువ మందిని తొలగించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. అలాంటప్పుడు కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి మంత్రి పదవి ఇస్తానంటూ బాబు ఇచ్చిన హామీ అమలు ఎలా సాధ్యమని టీడీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అందరిలోనూ అనుమానాలే: మూడు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలతో ఉన్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు భూమాకు మంత్రి పదవి ఇస్తే రాయలసీమ నుంచి తనకు అవకాశం దక్కదనే అనుమానంతో పయ్యావుల కేశవ్ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఉందనే  సాకుతో తనకు మంత్రి పదవి ఎగ్గొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే అనుమానాన్ని కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. కళా సమీప బంధువు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తమ సత్తా ఏమిటో చూపాలని కళా వర్గం ఎదురు చూస్తోంది. చంద్రబాబు ఎంత జంబోజెట్ మంత్రివర్గం ఏర్పాటు చేసినా.. ఆ సందర్భంగా తమకు ఎక్కడ ఉద్వాసన పలుకుతారోనని ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమను మం త్రులు చేస్తామనే హమీని తీసి ఎక్కడ గ ట్టున పెడతారోననే  భయాన్ని మంత్రి పదవులు ఆశిస్తున్నవారు వ్యక్తం చేస్తుంటే, మాకు ఇచ్చిన హామీలు పబ్బం గడుపుకోవటానికి ఇచ్చినవేనా అనే సందేహాన్ని తాజాగా టీడీపీలో చే రినవారు వ్యక్తం చేస్తున్నారు.  

ఇప్పుడే కాదు గత చరిత్ర కూడా అదే..
ఎన్‌టీ రామారావు స్థాపించిన  పార్టీని, ఆయన నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక రీతిలో స్వాధీనం చేసుకునే సమయంలో ఆరు నెలల పాటు తాను పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా  కొనసాగుతానని, ఆ తరువాత సమర్ధవంతమైన వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెడతానని చెప్పారు. తన బావమరిది, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆరు నెలలు కాదు కదా పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న 21 సంవత్సరాల తరువాత కూడా చంద్రబాబే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యేలా చూడాల్సి ఉంది. ఎన్‌టీ రామారావు మరణంతో ఖాళీ అయిన హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా జరగకుండా అడ్డుకుని చివరకు ఆరు నెలల మంత్రిగా హరికృష్ణను మిగిల్చారు. ఇక ఈ పరిణామాల్లో తనకు సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి.. చివరికి పార్టీ నుంచే బైటకు పంపేశారు. గుంటూరు జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ఆపత్కాలంలో చంద్రబాబు వెన్నంటి నడిచారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు ఇవ్వని చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తొలివిడత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఒక స్థానం ఖాయమని  తన నివాసంలో భోజనం పెట్టి మరీ హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ సీట్లకు  ఉప, ద్వై వార్షిక ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో ఆయన పేరు కనీసం పరిశీలనకు కూడా రాకపోవడం గమనార్హం. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ నేత కరణం బలరాంకు  ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టారు.
 
ఇన్‌చార్జిలకు మొండిచెయ్యే..!
తాజాగా పార్టీలో చేరుతున్నవారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మీకే అని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే 104 నియోజకవర్గాల్లో పార్టీకి ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలున్నారు.ఈ హామీని బట్టి చూస్తే ప్రస్తుతం ఇన్‌చార్జిలుగా ఉన్న వారికి చంద్రబాబు మొండి చేయి చూపబోతున్నారన్నది స్పష్టమౌతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీ నిజం చేస్తారని అనుకున్నా ప్రస్తుతం పార్టీలో చేరేవారికి, పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చే సే అవకాశం కల్పించాలంటే నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. అయితే విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు ఊసెత్తని కేంద్రం నియోజకవర్గాల సంఖ్యను ఎంతవరకు పెంచుతుందో అనుమానమే. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు.. ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర మా అధినేతకు గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండదు అని కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు.
 
 ఆ హామీలు అమలయ్యేవి కాదంటున్న అధికార పక్ష నేతలు
ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని హామీలు ఇవ్వాల్సిన అగత్యం ఏమొచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు హామీలను ఆ పార్టీలో చేరినవారు ఎంత నమ్ముతున్నారో తెలియదు కానీ అధికారపక్ష సభ్యులు మాత్రం ఇవి అమలయ్యేవి కాదంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తమకు సంవత్సరాల తరబడి ఇస్తూ వస్తున్న హామీలకు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అతీగతీ లేదని, విపక్ష ఎమ్మెల్యేలు ఇలా చేరిన వెంటనే ఇస్తున్న హామీలను అమలు చేస్తారని ఎలా అనుకుంటామని అధినేతను దగ్గర నుంచి చూసిన టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా పదే పదే మోసం చేయటం చంద్రబాబు నైజమని ఆయన వెంట నడిచిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement