ఆయన వస్తే నా దారి నాదే: రామసుబ్బారెడ్డి
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో ఆదినారాయణరెడ్డి చేరికను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో ఆదినారాయణరెడ్డి చేరితే తన దారి తాను చూసుకుంటానని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. ఆయన కారణంగా తన కుటుంబ సభ్యులను కోల్పోయానని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తానే కాదని, నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా ఆదినారాయణరెడ్డి చేరికపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు.
జమ్మలమడుగులో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలు,నష్టపోయిన వారికి ఆ బాధ తెలుస్తుందన్నారు. ఆదినారాయణ రెడ్డి చేరిక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని రామసుబ్బారెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధ్యక్షుడి మాటను గౌరవిస్తున్నామని, అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేనని,కార్యకర్తల అబిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి నేరుగా వినాలని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకం కాదని, పార్టీకి జరిగే నష్టం గురించి వివరించామన్నారు.