ఓటమి భయంతోనే బెదిరింపులు | tdp try to make voilance in nandyal | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే బెదిరింపులు

Published Wed, Jul 12 2017 9:46 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

ఓటమి భయంతోనే బెదిరింపులు - Sakshi

ఓటమి భయంతోనే బెదిరింపులు

- నంద్యాలలో అలజడికి టీడీపీ యత్నం
- ప్రలోభాలతో గెలవాలనుకోవడం అవివేకం
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజం
 
నంద్యాల అర్బన్‌ : ‘ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. దీంతో ప్రలోభాలకు లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రశాంతమైన నంద్యాలలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నార’ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ బెదిరింపులకు తమ పార్టీ శ్రేణులు కూడా భయపడబోవని స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారన్న ఊహాగానాలకు తెరదించుతూ బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవుల ఆశ చూపి నాయకులను తిప్పుకున్నంత మాత్రాన గెలుపు సాధిస్తామనుకోవడం అవివేకమన్నారు. ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్‌ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులతో దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. తమ  కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారని తెలిసే ప్రభుత్వం ఆ వర్గం నాయకులకు తాయిలాలు ఎర వేస్తోందన్నారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కేందుకు సిద్ధపడుతోందన్నారు. మూడేళ్ల పాలనలో నంద్యాల అభివృద్ధిని మరిచిన సర్కారు.. ఉప ఎన్నిక  నేపథ్యంలో రూ.కోట్లతో పనులు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
 
పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన తప్ప మిగిలిన అన్నీ చేస్తోందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ వారిని ఎప్పుడు తీసుకోవాలనే దానిపైనే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎంపీ ఎస్పీవైరెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీలోకి వెళ్లడాన్ని నంద్యాల ప్రజలు జీర్ణించుకోలేక పోయారన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాకముందే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఇందు కోసం ప్రలోభాలు, బెదిరింపులకు తెర తీసిందని విమర్శించారు. రాబోవు సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబట్టే అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.
 
సీఈసీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే నంద్యాల ప్రజలకు ఎనలేని అభిమానమన్నారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి,  నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రవిచంద్రకిశోర్‌రెడ్డి,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కైపరాముడు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement