మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీనరసింహం
ఎకో టూరిజానికి టెక్ మహేంద్ర సుముఖత
Published Wed, Sep 7 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గార మండలం కళింగపట్నం ప్రాంతంలోని రెండెకరాల స్థలంలో ఎకో – టూరిజం పార్కును ఏర్పాటు చేసేందుకు టెక్ మహేంద్ర సుముఖత వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెక్ మహేంద్ర ప్రాజెక్టు అధికారి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకో టూరిజం పార్కుకు కళింగపట్నం అనువైన ప్రాంతమని కలెక్టర్‌కు వివరించారు. ఇందుకు రెండెకరాల స్థలం అవసరముంటుందని, కళింగపట్నంలో ఉన్న టూరిజం రిసార్ట్స్ పక్కన ఉన్న స్థలం అనువుగా ఉంటుందని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాతూ పార్కుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
టెక్ మహేంద్ర ఏర్పాటు చేయబోయే పార్కులో హోటల్, రీసార్ట్స్ వంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును సందర్శించే వారికి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దర్శనీయ స్థలాలు, హస్తకళలు, జలపాతాలు, పక్షుల ఆవాస కేంద్రాలు వంటివి దర్శించేలా ప్యాకేజీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో అనేక రకాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, పురాతన గిరిజన నృత్యాలు, గ్రానైట్, దర్శనీయ స్థలాలు, ప్రముఖ దేవాలయాలు అమితంగా ఉన్నాయని, వీటన్నింటిని దర్శించేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 20న టెక్ మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన అనంతరం సమగ్రంగా చర్చించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సంయుక్త కలెక్టర్–2 పి. రజనీకాంతారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. దయానిధి, ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement