వేంపల్లె : వేంపల్లె పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉల్లి విజయ్ (36) అనే హోటల్ యజమాని మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయ్ ఐదేళ్ల క్రితం కేరళ రాష్ట్రం పాల్ఘడ్ నుంచి వేంపల్లెకు వచ్చి కళాశాలకు వెళ్లే దారిలో హోటల్‌ను నడుపుతున్నాడు. విజయ్ శుక్రవారం సాయంత్రం తన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లాడు. మోటారు బైకులో వెనుకవైపున కూర్చొని వస్తుండగా.. కడప రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద వేంపల్లె వైపు నుంచి వస్తున్న ఓ ఆటో ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. విజయ్ కాలుకు తీవ్ర గాయాలు కాగా ఆపరేషన్ కూడా చేయించారు. వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పారు. కానీ విజయ్ శరీరానికి ఇన్‌ఫెక‌్షన్ సోకడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహాన్ని కడప నుంచి వేంపల్లెకు బంధువులు తీసుకొచ్చారు. అనంతరం మృతుడి స్వగ్రామమైన కేరళలోని పాల్ఘడ్ ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి తల్లి సుభద్రమ్మ, సోదరులు కృష్ణమూర్తి, వినోద్ ఉన్నారు.