ప్రత్యక్ష పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం
Published Wed, Dec 7 2016 3:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
సాక్షి, నల్లగొండ : రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇప్పటికే పలు రకాల పోరాటాలు నిర్వహించిన ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాల వారీగా రుణమాఫీ రాని, ఫీజు రీ రీయింబర్స్‌మెంట్ జరగని 20వేల మంది రైతులు, 5వేల మంది విద్యార్థుల చేత పత్రాలు నింపించాలని, వాటన్నింటినీ రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశానికి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు హాజరయ్యారు.
జిల్లాలో రైతు రుణమాఫీ రాని, ఫీజు రీయింబర్స్‌మెంట్ జరగని రైతులు, విద్యార్థుల చేత పార్టీ రూపొందించిన పత్రాలను ఎలా నింపాలి, ఏ గ్రామంలో, ఏ నియోజకవర్గంలో ఎన్ని నింపాలనే దానిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలకు వివరించారు. ఈ పత్రాలన్నింటితో ఈనెల20న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరిగే భారీ ధర్నాకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వార్డు మెంబర్ నుంచి అన్ని స్థారుుల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సూచించారు. అదే విధంగా ఈనెల 9న సోనియా గాంధీ జన్మదినాన్ని భారీ ఎత్తున జరపాలని, ఈ సభల్లో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని చెపుతూ కృతజ్ఞతా దినంగా పాటించాలని ఆయన నేతలకు సూచించారు. సమావేశంలో భాగంగా మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపిక, కార్యవర్గంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ సమావేశంపై డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ’సాక్షి’తో మాట్లాడుతూ పాలకపార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని, వాటిని నెరవేర్చే దిశలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి అరుునా ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇక, పెద్ద నోట్ల రద్దు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలుడుతున్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని రెండు బస్తాల డీఏపీ, ఒక బస్తా యూరియాతో పాటు విత్తనాలను అరువుగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై కూడా త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు.
కాగా, సమీక్ష సమావేశంలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మల్లురవి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, చిరుమర్తి లింగయ్య, జగన్‌లాల్ నాయక్, స్రవంతిరెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ నేతలు చిరుమర్తి కృష్ణయ్య, స్కైలాబ్ నాయక్, పగిడి రామలింగయ్య యాదవ్, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement