ఖరీఫ్ సీజన్‌లోకి జొరబడినా సూర్యుడు తన ప్రతాపాన్ని ఆపడం లేదు. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రెండు రోజులు వర్షాలు: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లోకి జొరబడినా సూర్యుడు తన ప్రతాపాన్ని ఆపడం లేదు. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 44.4, ఆదిలాబాద్, హన్మకొండల్లో 44.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. నాలుగు చోట్ల మాత్రమే ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వైపు నగరంలో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 39.0 డిగ్రీలు నమోదు కాగా, కనిష్టం 27.3 డిగ్రీలుగా నమోదైంది. గత వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఉష్ణోగ్రత ఒకేసారి పడిపోవడంతో నగర వాతావరణంలో మార్పు వచ్చి చల్లబడింది. దీంతో నగరవాసులు వేడిమి నుంచి ఉపశమనం పొందినట్లయింది.
వడదెబ్బతో 33 మంది మృత్యువాత: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బతో 33 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మంలో ఏడుగురు, కరీంనగర్‌లో ఆరుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఒకరు, వరంగల్‌లో ఆరుగురు, మెదక్‌లో ఒకరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు, నల్లగొండలో ఎనిమిది మంది మరణించారు.