ఆ ఆరుగురికీ స్థానచలనం
ఆ ఆరుగురికీ స్థానచలనం
Published Fri, May 26 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
- ఎన్నాళ్ల కెన్నాళ్లకు బదిలీవేటు
- కదిలిన దేవాదాయశాఖ
- ‘సాక్షి’ ఎఫెక్ట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయ శాఖలో ఎన్నో ఏళ్లు తరువాత కదలిక వచ్చింది. ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి అవినీతిని పెంచిపోషిస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది. దశాబ్దాల కాలంగా పట్టించుకోని కాకినాడ డీసీ కార్యాయాన్ని ప్రక్షాళన చేశారు. అక్కడ పాతుకుపోయిన ఆరుగురు ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగిన అవినీతికి ఆలవాలంగా మారిన ఉద్యోగుల బండారాన్ని ఈ నెల 12న ‘ఆ ఆరుగురిదే హవా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు డీసీ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగుల వివరాలు సేకరించారు. అందులో అటెండర్‌గా ఉద్యోగంలో చేరి ఇక్కడే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా కూడా పదోన్నతులు పొందిన వారు కొందరు. జూనియర్ అసిస్టెంట్‌గా జాయినై సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై అదే కార్యాలయంలో పనిచేస్తూ పైసలివ్వందే ఫైళ్లు కదలని పరిస్థితి తీసుకువచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కాకినాడ డీసీ కార్యాలయంలో సుమారు 20 మంది అన్ని గ్రేడ్ల ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో ఆరుగురు మాత్రం అక్కడే తిష్టవేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బదిలీల కౌన్సెలింగ్‌లో భాగంగా డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఉద్యోగులను సాగనంపారు.
ఆ ఆరుగురికి స్థానం చలనం...
సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిలను రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దీపారాణిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి, మరో ఇద్దరు ఉద్యోగులు సురేష్‌కుమార్, రాజేశ్వరిలను కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయానికి బదిలీ చేశారు. మరొక సీనియర్ అసిస్టెంట్ సి.హెచ్. ఉదయకుమార్‌బాబు రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ బదిలీలపై డిప్యుటీ కమిషనర్ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల కార్యనిర్వాహణాధికారులు సంబరపడుతున్నారు. కార్యాలయానికి వెళ్లాలన్నా, ఫైళ్లు తీసుకువెళ్లాలన్నా చేయి తడపందే పనయ్యే పరిస్థితి ఉండేది కాదంటున్నారు. డీసీ కార్యాలయంలో ఏళ్లతరబడి తిష్టవేసిన ఆ ఆరుగురిపైన ఇన్నేళ్ల తరువాతైనా ఏకకాలంలో బదిలీ వేటు వేయడానికి కారణమైన సాక్షి’కి దేవాదాయశాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
Advertisement