
జ్యోతికి న్యాయం ఏదీ..?
♦ న్యాయం కోసం 52 రోజులుగా పోరాటం
♦ భర్త వేధింపులు తాళలేక చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు
♦ కనికరం చూపడం లేదంటున్న గ్రామస్తులు
చందంపేట (దేవరకొండ) :
రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది.. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తూ బిడ్డని కొడుకుగా భావించిన కుటుంబం అది.. కొడుకులు లేకపోయినా ఉన్న బిడ్డ చదువుకుంటే ఉన్నత స్థాయిలో ఉంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. తమ బిడ్డ ఉన్నత స్థాయికి వెళ్లి తమ కష్టాలను తీర్చుతుందని ఎన్నో కలలు కన్నారు. ఆ కలలు కల్లలయ్యాయి. అల్లుడికి ఉద్యోగం ఉందని, బిడ్డను చక్కగా చూసుకుంటాడని నమ్మి ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఇక సుఖ పడుతుందనుకున్న బిడ్డ.. వివాహం చేసిన కొద్ది రోజులకే కట్నం వేధింపులు, గృహ హింసతో ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆ గిరిజన కుటుంబం దేవకొండ డీఎస్పీ రవికుమార్, నేరెడుగొమ్ము పోలీసు స్టేషన్ మెట్లెక్కారు..
అసలు విషయానికొస్తే నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ దస్మా, జీజా దంపతుల ఏకైక కుమార్తె మూఢావత్ జ్యోతిని డిండి మండలంలోని చెర్కుపల్లి గ్రామపంచాయతీ దేవునిగుడితండాకు చెందిన లాస్యనాయక్, జీజా దంపతుల కుమారుడైన మూఢావత్ గోపాల్‌కు 2016 సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగం ఉందని నమ్మి సుజాతను ఇచ్చి వివాహం చేశారు. కానీ గోపాల్ కారు డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఇదే విషయం వివాహం అయిన నాలుగు నెలలకు జ్యోతికి తెలియడంతో భర్త గోపాల్‌ను ప్రశ్నించింది. తల్లిదండ్రులకు చెప్పడంతో నచ్చజెప్పి కాపురానికి పంపించారు.
పెళ్లి సమయంలో కట్న కానుకల దగ్గరి నుంచి బడిబాసండ్ల వరకు ఇచ్చేందుకు ఆ గిరిజన పేద కుటుంబం రూ.12 లక్షలు అప్పు చేసి పెళ్లిని వైభవంగా చేశారు. గోపాల్‌కు ప్రభుత్వ ఉద్యోగం లేదని, ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినందుకు గాను భార్యను గోపాల్ నిత్యం గృహ హింసకు పాల్పడుతూ మరో రూ.10 లక్షలు తేవాలంటూ.. జ్యోతి ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు జ్యోతిపై దాడి చేసి జోడుబాయితండాకు పంపించాడు. కాగా జ్యోతి ఏప్రిల్ 13న దేవరకొండలోని ఓ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. కాగా పురుడు కోసం జ్యోతి కుటుంబసభ్యులు గోపాల్‌కు సమాచారం అందించినా గ్రామానికి రాలేదు.
కాగా జ్యోతి ఇదే విషయాన్ని జూన్ 24వ తేదీన దేవరకొండలో డీఎస్పీ రవికుమార్‌కు ఫిర్యాదు చేసింది. కాగా డీఎస్పీ రవికుమార్ నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు తనకు న్యాయం చేయాలని పలుమార్లు పోలీసులకు మొరపెట్టుకుంది. పోలీసులు కూడా అప్పటి నుంచి గోపాల్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారే తప్ప తమకు ఎటువంటి న్యాయం చేయడం లేదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌కు జ్యోతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అయినా జ్యోతికి న్యాయం చేస్తారా.. అని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇదే విషయాన్ని నేరెడుగొమ్ము ఎస్‌ఐ క్రాంతికుమార్‌ను వివరణ కోరగా పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.