రాజకీయ ముసుగులో జిల్లాల ఏర్పాటు
గద్వాల : రాజకీయ నిర్ణయం అనే ముసుగులో ప్రభుత్వం ఇష్టానుసారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కోణంలో కాకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూచించిన విధివిధానాల ప్రకారం చూస్తే గద్వాలకే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, జిల్లా ఏర్పాటుకు గల అర్హతలను కూలంకషంగా కేసీఆర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు.
జిల్లాల ఏర్పాటులో నడిగడ్డ ప్రజలను కించపరిచేలా, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టమని హెచ్చరించారు. గద్వాలను జిల్లా చేస్తే 22 మండలాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. నది అగ్రహారం దగ్గర కృష్ణానదిపై ప్రతిపాదనలో ఉన్న బిడ్జి నిర్మాణం చేపడితే ఆత్మకూరు మండలం 10 కిలోమీటర్లలోపే ఉంటుందని, కొత్తకోట, మహబూబ్‌నగర్ పట్టణాలకు 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. సమావేశంలో నాయకులు వసంతరావు, కరుణాకర్, యోగీశ్వర్, వెంకట్రామిరెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.