
ఇక స్మార్ట్ పల్స్ సర్వే
► కొత్త పథకాలన్నిటికీ ఇదే ప్రామాణికం
► రెండు విడతలుగా నిర్వహణ
► జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): సోషియో ఎకనమిక్ సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) జిల్లాలో రెండు విడతలుగా జరుగుతుందని, ఈ సర్వే రానున్న రోజుల్లో అన్ని పథకాల అమలుకు ప్రామాణికమవుతుందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. స్మార్ట్ పల్స్ సర్వేపై గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్న ఈ సదస్సుకు కలెక్టర్ హాజరై స్మార్ట్‌పల్స్ సర్వే విధివిధానాలు వివరించారు. ఆధార్‌లో ఉన్న పేరే అన్నిటిలో రావాల్సి ఉందని తెలిపారు. మొదటి విడత సర్వే ఈనెల 20 నుంచి 30 వరకు, రెండవ విడత సర్వే జులై 6 నుంచి 31 వరకు జరుగుతుందని తెలిపారు.
సర్వే నిమిత్తం బ్లాక్‌లను నిర్ధారించే బాధ్యత తహసీల్దార్లదేనని, ప్రతి బ్లాక్‌లో 430 నుంచి 460 ఇళ్లు ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నిటిలోనూ సర్వే నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రతి 10 బ్లాక్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలన్నారు.
ట్యాబ్‌లతో సర్వే
ఈ సర్వేలో కాగితం ఉపయోగించే అవకాశం లేదని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ట్యాబ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే సర్వే వివరాలు నమోదు చేయాలన్నారు. నెట్‌వర్క్ కనెక్టివిటీ లేకపోతే ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకుని తర్వాత ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. రోజుకు 8 గంటలు 14 ఇళ్లు మాత్రమే సర్వే నిర్వహించాలన్నారు. ఇది వరకు ఉన్న పింఛన్లు, రేషన్ కార్డులకు ఈ సర్వేతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, కొత్త పథకాల కోసమే ఈ సర్వే ప్రామాణికమవుతుందని తెలిపారు. సర్వే వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్, డీపీఓ శోభస్వరూపరాణి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ఆర్‌డీఓలు రఘుబాబు, ఓబులేసు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.