మళ్లీ కోరలు చాస్తున్న... హెచ్‌ఐవీ భూతం | The spread of HIV infection | Sakshi
Sakshi News home page

మళ్లీ కోరలు చాస్తున్న... హెచ్‌ఐవీ భూతం

Published Mon, Mar 14 2016 12:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

మళ్లీ కోరలు చాస్తున్న...  హెచ్‌ఐవీ భూతం - Sakshi

మళ్లీ కోరలు చాస్తున్న... హెచ్‌ఐవీ భూతం

చాప కింద నీరులా వ్యాధి వ్యాప్తి
రాష్ట్రంలో గుంటూరు జిల్లా టాప్
మూడో స్థానంలో కృష్ణాజిల్లా
తాజా సర్వేలో వెల్లడి
వ్యాధి నిర్ధారణకు కిట్లు కూడా లేవు
పట్టించుకోని ప్రభుత్వం

 
హెచ్‌ఐవీ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. పాలకులు పట్టించుకోక.. నిధులు విడుదల కాకపోవడంతో వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. మందుల కొరత వల్ల అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా స్తంభించిపోవటంతో మరోసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.
 
విజయవాడ (లబ్బీపేట) : ఐదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిలో గుంటూరు, కృష్ణాజిల్లాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేవి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 20 శాతం ఈ జిల్లాల్లోనే నమోదవడంతో అప్పటి ప్రభుత్వం అప్రమత్తమై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణకు ఐసీటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చేందుకు ఏఆర్‌టీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో రెండేళ్ల కిందట హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో పాత రోజులు పునరావృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్)కి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో హెచ్‌ఐవీ  నియంత్రణ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఐవీ వ్యాప్తిలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉన్నాయంటూ ప్రభుత్వం వెల్లడించిన తాజా సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
నిర్ధారణ కిట్‌లు లేవు

వ్యాధి లక్షణాలతో స్వచ్ఛందంగా పరీక్షల కోసం వచ్చిన వారికి ఆయా కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేయాల్సి ఉంది. పీవీటీసీటీలో గర్భిణులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏడాదిగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు లేక ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హెచ్‌ఐవీ లక్షణాలు ఉన్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు అలాగే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు హెచ్‌ఐవీ బాధిత గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ ఐవీ సోకకుండా పుట్టిన వెంటనే ‘నెవిరిఫిన్’ అనే సిరప్ వేస్తారు. ప్రస్తుతం సిరప్‌లు లేకపోవడంతో తల్లి నుంచి బిడ్డకు వచ్చే హెచ్‌ఐవీని నిరోధించలేకపోతున్నారు. దీంతో పది నెలల కాలంలో గుంటూరులో 3,495 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణాజిల్లాలో 2,376 కేసులు నమోదయ్యాయి.
 
మందుల కొరత
కృష్ణాజిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఆరు ఏఆర్‌టీ సెంటర్లు ఉం డగా, వాటిలో 32,660 మంది మందులు వాడుతున్నారు. ఒక్కసారి మందుల వాడకం ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సిందే. ఒక్కో సమయంలో ఏఆర్‌టీ మందుల కొరత నెలకొనడంతో, రోగులకు ఏంచేయాలో దిక్కుతోచని దుస్థితి నెలకొంటోంది. దీంతో వ్యాధి ముదిరి కొందరు రోగులు మృత్యువాత పడుతున్నట్లు చెపుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
అవగాహన కార్యక్రమాలెక్కడ?

 ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాల్లో హెచ్‌ఐవీ వైరస్‌పై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటనలు, ప్రచారంతో విస్తృత స్థాయిలో ఈ వ్యాధిపై అవగాహన కలిగించాయి. ప్రస్తుతం హెచ్‌ఐవీ అంశాన్ని పక్కన పెట్టేశారు. కనీస నిధులు మంజూరు చేయకపోవడమే గాక సిబ్బంది జీతాలు కూడా చెల్లించని దుస్థితి నెలకొంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న 500 మంది సిబ్బంది జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
 
పింఛను విషయంలో మొండిచేయి...

 ఏఆర్‌టీ కేంద్రాల్లో ముందులు వాడుతున్న వారందరికీ ప్రతినెలా పింఛను మంజూరు చేయాల్సి ఉంది. ఇలా రెండు జిల్లాల్లో 32,660 మందికి ఫించన్లు అందాల్సి ఉండగా, మూడువేల మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలినవారు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వేర్వేరు కారణాలు చూపుతూ వారికి మొండిచేయి చూపుతున్నారు. దీంతో వారంతా పింఛను కోసం ఎదురుచూస్తూ కాలం    వెళ్లదీస్తున్నారు.
 
రెండు జిల్లాల్లో లక్షన్నరకు పైగానే...
హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ చేసేందుకు కృష్ణాజిల్లాలో 14 ఐసీటీసీ కేంద్రాలు, 4 పీపీటీసీటీలు, 87 ఎఫ్‌ఐసీటీసీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా, 66,276 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. కొందరు మృతి చెందగా, ఏఆర్‌టీ సెంటర్లలో 37,739 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారు 14,660 మంది మందులు వాడుతున్నారు. గుంటూరు జిల్లాలో 19 ఐసీటీసీలు, 6 ఏఆర్‌టీ సెంటర్లు ఉండగా, వంద వరకు ఎఫ్‌ఐసీటీసీలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటిలో పరీక్షలు చేసిన వారిలో 66 వేల మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ రాగా, 47 వేల మంది ఏఆర్‌టీల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో 18 వేల మంది మందులు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వీరు కాక అనధికారికంగా మరో 20 వేల మంది ఉంటారనేది అంచనా. ఇలా రెండు జిల్లాల్లో కలిపి మొత్తం లక్షా 50 వేల మంది ఉంటారని అధికారులే చెపుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement