వివాహేతర సంబంధ నేపథ్యంలో మహిళ మృతి
వెంకటపాలెం (తుళ్లూరు రూరల్): వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహిత మృతి చెందిన సంఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వద్ద తోటావారిపాలెం గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారి(25), ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రశాంతి బీఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసింది. దీంతో అశోక్ సింగరాయకొండలోనే ఉంటూ సిమెంట్ పని చేస్తూ భార్యను ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశాడు.
అయితే రాజధానిలో పనులు అధికంగా ఉంటాయని వెంకటపాలెంకు వలస వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పని ముగించుకుని అశోక్ భోజనానికి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా భార్య తీయలేదు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న గ్రామ పంచాయతీ గుమస్తా పి.సత్యనారాయణ బయటకు వస్తూ అశోక్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీనిపై భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, అశోక్ భార్యకు నిప్పు అంటించడంతో పెద్దగా కేకలు వేసింది. అశోక్ మంటలు ఆర్పి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తుళ్లూరు ఎస్సై సందీప్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి వద్ద నుంచి వాగ్మూలాన్ని తీసుకున్నారు. చికిత్స పొందుతున్న ప్రశాంతి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.