‘ఫుల్లు’ మనీ
♦ జిల్లాలో రికార్డుస్థాయిలో మద్యం వ్యాపారం
♦ నెలకు రూ.70 కోట్లు దాటుతున్న విక్రయాలు
♦ రెండున్నర నెలల్లో రూ.297.22 కోట్ల టర్నోవర్
♦ మున్ముందు శుభకార్యాలపై ఎక్సైజ్ శాఖ ఆశలు
వైరా: మందు వ్యాపారం చిందేస్తోంది. మునుపటి ఆదాయం తాలూకు రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. మద్యం ప్రియుల కోసం సర్కారు నిబంధనలు సడలిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో అమ్మకాలు ఊపందుకున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అమ్మకాల తీరును పరిశీలించి ఎక్సైజ్ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు, పండుగలేవీ లేకున్నా విక్రయాలు జోరుగా సాగుతుండటంతో ఖజానా ఫుల్లు అవుతోంది. ఈ వార్షిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ 14వ తేదీ నాటికి రూ.297.22 కోట్ల వ్యాపారం జరగటం గమనార్హం. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సగటున రూ.142.36 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వేసవిలో బీరు విక్రయాలు జోరుగా సాగగా.. లిక్కర్ వ్యాపారం కాస్త తగ్గింది. ప్రసుత్తం వర్షాకాలం రావడంతో లిక్కర్ విక్రయాలు ఊపందుకోనున్నాయి.
లిక్కర్ జోరు..
జిల్లాలో 148 వైన్ షాపులు, 44 బార్లు, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 2000 వరకు అనధికారిక బెల్టు షాపులు నడుస్తున్నాయి. జిల్లాలో ఒకవైపు పట్టణ ప్రాంతం, మరోవైపు గ్రామీణ వాతావరణం మిళితమై ఉండటంతో లిక్కర్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా అధికారులు ప్రకటించటంతో గ్రామాల్లో నాటు సారా అమ్మకాలు బాగా తగ్గాయి. లిక్కర్ విక్రయాలు ఊపందుకున్నాయి. లిక్కర్ విక్రయాలు గతం కంటే దాదాపు రెట్టింపవుతున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.86.65 కోట్ల వ్యాపారం జరగ్గా, మే నెలలో రూ.86.28 కోట్ల విక్రయాలు జరిగాయి. ఏప్రిల్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలుండటంతో విక్రయాలు బాగా జరిగాయి. మే నెలలో శుభకార్యాలు లేకపోవడంతో వ్యాపారం కాస్త మందగించింది. అమ్మకాలు 10 శాతం మేర తగ్గాయి. మొత్తంగా ప్రతి నెలలో మద్యం వ్యాపారం రూ.70 కోట్లు దాటడం విశేషం.
ఉందిలే మంచికాలం ముందు‘మందు’రా..
ఈ నెల మూడో వారం నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. గత నెలన్నరగా నిలిచిపోయిన శుభకార్యాలకు సమయం అనుకూలం కావడంతో మద్యం వ్యాపారం సైతం జోరందుకోనుంది. మద్యం డీలర్లు స్టాకును ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నారు. ఈ నెలలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగినప్పటికీ గత నెల కోటా నుంచే విక్రయాలు జరిగిన ట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 14వ తేదీ నాటికి రూ.36 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ.48 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది ఈ నెలాఖరు నాటికి రూ.70 కోట్ల వ్యాపారం జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.