డయలేదాయె!
♦ డయాగ్నోస్టిక్ సెంటర్ లేనట్టే!
♦ రూ.12కోట్లు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం
♦ ఈసారికి సారీ అని మౌఖిక ఆదేశాలు
♦ కర్నూలు పెద్దాసుపత్రికి మరో అన్యాయం
కర్నూలు(హాస్పిటల్): అడిగేవారులేరని ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెనక్కి తీసేసుకుంటోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తుంగభద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) చేస్తామని, కర్నూలులో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ హామీలకు తూట్లు పొడిచారు. తాజాగా ఆసుపత్రికి ఏడాదిన్నర క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను కూడా రద్దు చేశారు. ఈ విషయమై వైద్యవర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక వైఎస్‌ఆర్ జిల్లా, అనంతపురం, ప్రకాశం, మహబూబ్‌నగర్, రాయచోటి, బళ్లారి జిల్లాల నుంచి ప్రతిరోజూ 3వేల మంది దాకా రోగులు చికిత్స నిమిత్తమై వస్తుంటారు.
వీరేగాక నిత్యం 1400 నుంచి 1500మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటారు. వీరందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే ఆసుపత్రిలో పెద్ద ప్రహసనంగా ఉంటోంది. ఒక్కో వైద్యపరీక్ష ఒక్కోచోట ఏర్పాటు చేయడంతో రోగులకు ఇబ్బందిగా మారింది. అవుట్ పేషెంట్ల వైద్యపరీక్షలకు 33వ నం బర్‌లో, ఇన్‌పేషంట్లకు 24వ నెంబర్లో, బ్లడ్‌గ్రూప్ చేయించుకోవాలంటే 19వ నెంబర్‌లో, హెచ్‌ఐవీ, హెచ్‌బీసీ వంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఏఆర్‌టీ సెంటర్ వద్ద, కొన్ని రకాల బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలంటే మెడికల్ కాలేజిలోని పెథాలజి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎంఆర్‌ఐ, సిటిస్కాన్ పరీక్షలు ఒకచోట, ఎక్స్‌రే పరీక్షలు నాలుగు చోట్ల, అల్ట్రాసౌండ్ పరీక్షలు ఒకచోట చేస్తారు.
నిత్యం ఆసుపత్రిలో సంచరించే వారికే ఒక్కోసారి ఏ బ్లాక్ ఎక్కడ ఉందో, ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో అర్థం కాదు. వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి తిరిగేందుకు గంట సమయం పడుతుంది. ఇక వాటి నివేదికలు రావాలంటే ఒక్కోసారి రెండు నుంచి వారం రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కో పరీక్ష ఒక్కో చోట గాకుండా అన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ.12కోట్ల అంచనాతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు జీవో జారీ చేసింది.
నోరుమొదపని ప్రజాప్రతినిధ/లు..
రెండేళ్ల క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు మోకాలొడ్డుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్లానింగ్ మార్చాలని చెబుతూ రెండేళ్ల పాటు నిర్మాణం జరగకుండా జాప్యం చేశారు. ఆరు నెలల క్రితం డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పార్కింగ్ స్థలాన్ని కూడా ఎంపిక చేసి మట్టి పరీక్షలు కూడా నిర్వహించి ఓకే చేశారు. కానీ ఏమైందో ఏమో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీని నిర్మాణం గురించి అడగొద్దంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ భవనం వస్తే అన్ని రకాల పరీక్షలు ఒకేచోట చేయించుకోవచ్చన్న రోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిదులు సైతం ప్రశ్నించకపోవడంతో రూ.12కోట్లు కాస్తా గుంటూరు జిల్లాకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
కర్నూలుకు తీరని అన్యాయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలుకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టిమ్స్, రిమ్స్, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ చెప్పినా ఏవీ అమలు కాలేదు. తాజాగా రూ.12కోట్లతో మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను సైతం ఇతర ప్రాంతానికి తరలించాలని చూడటం దారుణం. ఇది కర్నూలు జిల్లా వాసులకు తీరని అన్యాయం. ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులను నమ్ముకుని ఎంతో మంది రోగులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి మరిన్ని మెరుగైన వైద్యసౌకర్యాలు అందించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా సమీక్షించి ఆసుపత్రిని అభివృద్ధి పరచాలి.
–డాక్టర్ రామకృష్ణనాయక్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కర్నూలు కార్యదర్శి