
టీడీపీ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం
నక్కపల్లి (విశాఖపట్నం) : కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఆదివారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎంపీ కాకినాడ నుంచి విశాఖ వెళుతుండగా వాహనం చినదొడ్డిగల్లు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పైకి ఎక్కింది. ముందు చక్రం విరిగిన వాహనం డివైడర్ మధ్యలో నిలిచిపోయింది. అరుుతే తోట ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
విషయం తె లిసిన చినదొడ్డిగల్లు ఎంపీటీసీ సభ్యుడు వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ డెరైక్టర్ వెలగా సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎంపీని పరామర్శించారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నట్టు తెలిసింది. తోట స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భగవంతుని దయవల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానన్నారు. హైవే పోలీస్ సిబ్బంది క్రేన్‌ను రప్పించి వాహనాన్ని పక్కకు తొలగించారు. తర్వాత ఎంపీ మరో వాహనంలో విశాఖ వెళ్లారు.