పీఎఫ్ గోల్‌మాల్..
కడప అర్బన్:
లబ్ధిదారుల ఖాతాల్లో నుంచి డబ్బులు కాజేసిన కేసులో కడపలోని రీజనల్ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు ఉద్యోగులను శనివారం స్థానిక బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 9 లక్షల నగదును, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయయంపై కడప ఒన్‌టౌన్ సీఐ కె.రమేష్ మాట్లాడుతూ పీఎఫ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కె. సత్యనారాయణరావు పీఎఫ్ ఖాతాల్లోని డబ్బులను ప్రతినెలా కొంత మొత్తాన్ని తన బంధువుల ఖాతాల్లోకి జమజేస్తుండేవార న్నారు. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ పొందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఎరికలయ్యలు ఉన్నారని తమ దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందన్నారు.
గతేడాదిలో తాడిపత్రికి చెందిన గౌసియాకు చెందిన ఖాతాలో రూ.29వేలు మంజూరయ్యాయన్నారు. డబ్బుల కోసం వెళితే బ్యాంక్ ఖాతాలో డబ్బులే లేవనడంతో ఆమె కంగుతింది. పీఎఫ్ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారించగా బాధితురాలి ఖాతాలోకి కాకుండా నిందితుని బంధువు ఖాతాలోకి జమైనట్లు గుర్తించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ కార్యాలయం సహాయ కమిషనర్ అజయ్ మనవళన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో వివిధ పీఎఫ్ ఖాతాల నుంచి రూ.42 లక్షలు నిందితులు కాజేశారనీ తేలిందన్నారు. కేసును మరింత దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులతో పాటు ప్రస్తుతం విశాఖపట్నం పీఎఫ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వై రాజశేఖర్‌రెడ్డి పాత్ర కూడా ప్రధానంగా ఉందన్నారు. ఈయన ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఈ వ్యవహారం ప్రాథమికంగా తెలియడంతో ఆ శాఖ అధికారులు బదిలీ చేశారన్నారు. అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్‌కు విధించారన్నారు.