కూడేరు : అగ్ని ప్రమాదం మూడు పేద కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆదాయాన్ని అందించే దుకాణాలు కాలి బూడిదయ్యాయి. వివరాలు.. మండలకేంద్రం కూడేరు కలగళ్ల రోడ్డులో సాలమ్మ టిఫిన్ సెంటర్‌ను, ఎర్రిస్వామి కల్లు దుకాణాన్ని, అక్కులప్ప చికెన్ సెంటర్‌ను నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 1:30కు ఈ మూడు దుకాణాల నుంచి మంటలు లేచాయి. మొదట చికెన్ సెంటర్‌లో మంటలు వ్యాపించి.. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు ఇల్లలోనుంచి బయటకు వచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు లేచాయి.
స్థానికులు వెంటనే ఫైరింజన్‌కు ఫోన్ చేశారు. అనంతపురం నుంచి ఫైరింజన్ వచ్చేటప్పటికి మూడు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దుకాణాల్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు వచ్చాయా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేపట్టారు. మూడు దుకాణాల్లోనూ కలిపి రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు.
అగ్ని ప్రమాదంతో మూడు దుకాణాల దగ్ధం
Published Sat, Feb 11 2017 11:14 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement