‘మాఫీ’ కోసం అప్పుతెద్దాం!
♦ రైతులకు ఒకేసారి పూర్తిగా రుణమాఫీపై వ్యవసాయ శాఖ ప్రతిపాదన
♦ ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపుపై ఆశలు
♦ సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ యోచన
♦ వడ్డీ తడిసి మోపెడు అవుతుందంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం
♦ దాదాపు రూ.1,300 కోట్ల భారం పడుతుందని అంచనా
♦ అవకతవకలపై తేల్చాకే ముందుకెళ్లాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో మిగతా నిధులను ఒకేసారి చెల్లించడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నిధులన్నీ ఒకేసారి చెల్లించడం కోసం అప్పులు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపుపై ఆశలు పెట్టుకుంది. సీడ్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు సమీకరించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వడ్డీ తడిసిమోపెడు అవుతుందని, రుణమాఫీలో పక్కదారి పట్టిన సొమ్ముకూడా గల్లంతు అవుతుందని హెచ్చరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రకటించారు.
రుణమాఫీ నిధులను ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని సడలిస్తే రూ.4,000 కోట్లు అప్పు తెచ్చుకునే వీలు ఏర్పడుతుందని, దీనితో రుణమాఫీకి నిధులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపుపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు. సడలించినా అంత మేరకు నిధులను డిస్కంల విద్యుత్ బాండ్లపై తీసుకున్న అప్పుల బకాయిలు తీర్చాలనే షరతు విధించటం ఖాయమైంది.
సీడ్ కార్పొరేషన్ ద్వారా లోన్
ఇదే వ్యవధిలో రుణమాఫీ నిధుల సమీకరణకు వ్యవసాయ శాఖ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లు రుణంగా తీసుకోవాలని... దానితో రుణమాఫీ బకాయిలు ఒకేసారి చెల్లించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. అయితే ఈ ప్రతిపాదనపై ఆర్థికశాఖ మొదట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది.
లెక్కలు తేలాలి
రుణమాఫీ బకాయిలకు మరో రూ. 8,000 కోట్లు కావాలని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. పక్కాగా ఆడిటింగ్ జరిగితే ఈ మొత్తం కొంతవరకు తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇటీవల ఆడిట్ విభాగం పది జిల్లాలో చేపట్టిన శాంపిల్ సర్వేలో బోగస్ రుణాలు, బోగస్ పట్టాలు, డబుల్ ఎంట్రీల ద్వారా రుణమాఫీలో పది శాతం దాకా అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చింది. బ్రాంచీల వారీగా సమగ్ర విచారణ జరిపితే కనీసం రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఆడిటింగ్ పూర్తయ్యే వరకు వన్ టైం సెటిల్‌మెంట్ జోలికి వెళ్లడం సరికాదని పేర్కొంటోంది. తొందరపడి అప్పు తెచ్చి రుణమాఫీ నిధులు చెల్లిస్తే.. పక్కదారి పట్టిన రూ.500 కోట్లు గల్లంతవుతాయని, వడ్డీ భారం కూడా కలిపి దాదాపు రూ.1,300 కోట్లు అవుతుందని స్పష్టం చేస్తోంది.
భారీగా వడ్డీ భారం..
రుణమాఫీ చేసేందుకు కొత్తగా రుణం తీసుకుంటే వడ్డీ భారం భారీగా పెరిగిపోతుందని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రైతుల పంట రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్రం 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. అదే కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుంటే 9 నుంచి 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5 నుంచి 6 శాతం వడ్డీ భరించాల్సి వస్తుంది. రూ. 8,000 కోట్లు అప్పు తీసుకుంటే ఏడాదికి రూ. 400 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.800 కోట్లు వడ్డీ చెల్లించాలి. దీంతో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ‘‘బ్యాంకుల దగ్గర రుణం తీసుకొని.. బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాల మాఫీకి చెల్లించే సంప్రదాయం ఆర్థిక వ్యవహారాల్లో సరైంది కాదు.. దీంతో ప్రభుత్వానికి, రైతులకు ఒరిగే ప్రయోజనం కంటే బ్యాంకులే ఎక్కువగా లాభపడుతాయి..’’ అని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.