అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
► ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆర్వీ కర్ణన్
► వైద్యాధికారులతో సమీక్ష సమావేశం
ఉట్నూర్ : సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ ఆస్పత్రి వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యం కోసం సీహెచ్‌సీకి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని, జ్వరాలతో వచ్చే వారికి రక్త పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు ప్రసవం కోసం వస్తే ఆస్పత్రిలోనే ప్రసవం చేయూలని, రిమ్స్‌కు తరలించి చేతులు దులిపేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసవం కోసం వచ్చేవారిని రిమ్స్‌కు రెఫర్ చేయడం మానుకోవాలని సూచించారు. పరిస్థి తి విషమిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రిలో స్త్రీ వైద్య నిపుణుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓపీ వైద్యులు ఎల్లవేళల్లో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని, వైద్యుల పనితీరు మెరుగుపర్చడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, వైద్యులు మాలతిరెడ్డి, రవి, సుందరి, సంజీవ్‌రెడ్డి, అవి నాష్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.