హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ నేపథ్యంలో రాష్ర్టమంతా భద్రతాపరంగా అప్రమత్తమయ్యారు.
సాక్షి,తిరుమల: హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ నేపథ్యంలో రాష్ర్టమంతా భద్రతాపరంగా అప్రమత్తమయ్యారు. తిరుమలలో కూడా ముందస్తుగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఆలయంలోకి వెళ్లే అన్నిమార్గాల్లోనూ తనిఖీ వ్యవస్థను పటిష్టం చేశారు. భక్తులను సైతం నిశితంగా తనికీ చేసి అనుమతించారు. ఇక ఆలయం వెలుపల కూడా నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. బాంబు డిస్పోజబుల్, డాగ్‌స్క్వాడ్‌లు కూడా అప్రమత్తమయ్యాయి.
ఆలయ నాలుగు మాడ వీధుల్లోనూ భద్రతను పెంచారు. యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. మఫ్తీల్లో గస్తీ తిరిగారు. ఇక ఆలయంతోపాటు రద్దీగా ఉండే కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాదం వద్ద కూడా భద్రతను అప్రమత్తం చేశారు. తిరుమలకు ప్రవేశ మార్గాలైన తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రాల్లోనూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా జనం కదలికలపై నిఘా పెట్టారు.