
అక్రమాలకు అడ్డా!
ఇబ్రహీంపట్నం నగరానికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని భూములకు మంచి డిమాండ్ ఉంది.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నగరానికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని భూములకు మంచి డిమాండ్ ఉంది. దండుమైలారం గ్రామం హఫీజ్‌పూర్ రెవెన్యూ పరిధిలో 36 సర్వేనెంబర్‌లో రూ. 15 కోట్ల విలువ చేసే సుమారు 50 ఎకరాల సర్కార్, జంగ్లత్ ఆక్రమ రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరిగిన విషయం ఈ ప్రాంతాన్ని కుదిపివేసింది. నిజాం వారుసులమని, పైగా కుటుంబీకులమని మండల పరిధిలో సుమారు 3వేల ఎకరాలపై ఆక్రమార్కుల కన్నేశారు. దీనికి న్యాయస్థానాన్ని ఆడ్డుపెట్టుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో వారి పేర్లపై ఎలాంటి రికార్డులు లేకున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతుండం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవినీతి అధికారులతో రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖ కంపుకొడుతోంది.
పూర్తిస్థాయిలో రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తే సస్పెన్షన్‌కు గురైన ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ సలేహానే కాకుండా మరి కొంతమంది బండారం బయటపడే ఆవకాశముంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం పేదలకు అసైన్‌చేసిన భూములను సైతం అక్రమార్కులు రిజిస్ట్రేషన్ల చేయించుకున్నారు. 124 సర్వే నెంబర్‌లో అసైన్ చేసిన భూములను పేద రైతులు విక్రయిస్తే వాటిని పీఓటీ కింద తిరిగి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.. అదే నెంబర్‌లో సుమారు 8 ఎకరాలను ఒక రియల్టర్ కొని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. చట్టంలోని లొసుగులను ఆ రియల్టర్ ఉపయోగించుకొని ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన కబ్జాలో పెట్టుకున్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో వెలిసిన పలు వెంచర్లలోని పార్కు స్థలాలు కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ప్రైవేట్ వ్యక్తులతో రియల్టర్లు, పైరవీకారులు కుమ్మక్కై పార్కు స్థలాల విక్రయించడంలో కీలకపాత్ర పోషించారనే విమర్శలున్నాయి. తెరచాటు జరిగిన ఈ తతంగాలు బయటపడాలంటే పూర్తిస్థాయిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించాల్సిన అవసరముంది.
ప్రతిపనికో రేటు....
వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు వచ్చే వ్యక్తులను బట్టి ఒక్కోదానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వ్యక్తులను బట్టి ప్లాటు రిజిస్ట్ర్రేషన్‌కు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు, ఎకరా వ్యవసాయ భూమికి రూ.వెయ్యి నుంచి రూ.రెండున్నర వేలు, ఈసీకి రూ.300 నుంచి రూ.350 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. డబుల్ రిజిస్ట్రేషన్లు, గ్రామ కంఠం, వక్ప్‌బోర్డుకు సంబంధించిన భూములకు మరోరకంగా వసూలు చేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దస్తావేజు లేఖరులు దండుకున్న దాంట్లో కార్యాలయ అధికారులకు, బ్రోకర్లకు వాటా తప్పనిసరి. గతంలో ఏసీబీ దాడులు జరిగిన అధికారుల తీరులో మార్పు రాలేదు.
అవినీతికి నిలయం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. భూ కుంభకోణాలు జరగకుండా చూడాల్సిన అధికారులే బడా బాబులకు వత్తాసు పలుకుతున్నారు. గతంలో జరిగిన భూ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి.
– కావలి నర్సింహ, సీపీఐ నేత
అక్రమాలకుపాల్పడే వారిపై కఠిన చర్యలు
వేలాది రూపాయల జీతం తీసుకునే అధికారులు.. అవినీతి, అక్రమాలకుపాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూ కుంభకోణాలన్నింటిరీ వెలికితీయాలి. ప్రభుత్వ భూములను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– ముసలయ్య, రైతుసంఘం నాయకుడు