ఆర్డీఓ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించాలి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసే ఆర్డీఓ కార్యాలయంలోని సౌకర్యాలను గురువారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయ భవనంలో అన్ని గదులను కలియదిరిగి చూశారు. కార్యాలయం ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం ముందు గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ..
కార్యాలయం ఏర్పాటుకు సంబంధించినపనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల 11న కార్యాలయం ప్రారంభం కానుందని తెలిసినా పనులు చురుకుగా సాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి రానున్నందున ఈ నెల 10వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, కోదాడ తహసీల్దార్ వి.శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరశర్మ, ఆర్‌ఐ జానకిరామిరెడ్డి, పలువురు వీఆర్‌ఓలు పాల్గొన్నారు.