భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బ్రహ్మాస్త్రంగా మారిన పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) వాణిజ్యపరమైన ప్రయోగాల్లో...
నేడు సీ34 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బ్రహ్మాస్త్రంగా మారిన పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 53 ప్రయోగాల్లో 35 ప్రయోగాలు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌వే కావడం విశేషం. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చి పెడుతోంది.
చంద్రయాన్, మంగళ్‌యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎల్‌వీకే సొంతం. ఇప్పటిదాకా 34 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల ద్వారా 89 ఉపగ్రహాలను ప్రయోగించగా ఇందులో 57 విదేశీ ఉపగ్రహాలు, 36 స్వదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా దూరపరిశీలనా ఉపగ్రహాలు, సమాచార ఉపగ్రహాలుప్రయోగించడమే కాకుండా గ్రహాంతర పరిశోధనలకు సంబంధించిన ఉపగ్రహాలు, ప్రస్తుతం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ తరహా ఉపగ్రహాలను సైతం పీఎస్‌ఎల్‌వీ ద్వారానే ప్రయోగించడం విశేషం.
తిరుగులేని వాహకనౌక
శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించిన ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అనే నాలుగు రకాల ఉపగ్రహ వాహకనౌకల్లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మాత్రమే తిరుగులేని వాహకనౌకగా మారింది. ఈ రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేందుకు ఎలాంటి స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు.
దీన్ని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. అదే ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెఎల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటికి 13 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ ద్వారా ఇప్పటిదాకా ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూరపరిశీలనా ఉపగ్రహాలు)ను పంపారు. అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించి విజయాలను సొంతం చేసుకున్నారు.
వాణిజ్యపరమైన ప్రయోగాల్లో ఇస్రోకు పీఎస్‌ఎల్‌వీ ఆదాయం తెచ్చిపెట్టే గనిగా మారింది. ఇస్రోకు వాణిజ్యపరంగా సంవత్సరానికి సుమారు రూ.1,100 కోట్లు ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే కావడం విశేషం. ఈ క్రమంలో నేడు పీఎస్‌ఎల్‌వీ సీ34 ద్వారా 20 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.