ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ధర్మవరం, బుక్కరాయముద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ధర్మవరం, బుక్కరాయముద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం 11.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ధర్మవరం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన ఎన్టీఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలోని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. వనం– మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి బుక్కరాయసముద్రం చేరుకుని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కస్తూరిబా విద్యాలయం సమీపంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో పాల్గొంటారు. ఆ సంఘాలకు మినీ ట్రాక్టర్లను అందజేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి పుట్టపర్తికి చేరుకుని ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు వెళతారు.