– నేడు డీఆర్‌డీఏ ఉద్యోగులకు కౌన్సెలింగ్
– పనితీరు ఆధారంగానే పోస్టింగులు
అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగులో బదిలీలకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ భవన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి స్థాన చలనం కలగనుంది. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరుగురు డీపీఎంలు, 20 మంది ఏపీఎంలు, 94 మంది సీసీలతో పాటు ఏపీఆర్‌ఐజీపీ (గ్రామీణ సమ్మిళిత పురోగతి కార్యక్రమం) కింద ఉన్న 12 మండలాల్లోని 17 మంది ఏపీఎంలను బదిలీ చేయనున్నారు. ఏపీఆర్‌ఐజీపీ మండలాల్లో పని చేస్తున్న ఏపీఎంలను రద్దు చేసి సీసీలుగా చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్ వివరాలను ఇప్పటికే సంబంధిత ఉద్యోగులకు ఈ–మెయిల్ చేశారు. ఇక మూడేళ్లు దాటిన వారికి కూడా బదిలీ ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.