
'జిల్లాల' సెగలు: నేటి నుంచి డీకే నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. శనివారం ఉదయం ఇక్కడ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమయ్యే ఈ దీక్ష 48 గంటల పాటు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలతో పాటు వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ఏర్పా టు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. టీపీసీసీ నేతలతోపాటు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేధావులు పాల్గొంటారని అరుణ, పొన్నాల వెల్లడించారు.
అడ్డగోలుగా విభజన...
జిల్లాల విభజన అత్యంత అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జిల్లాలను విభజించారన్నారు.గద్వాల, జనగామ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు.
జిల్లాల ఏర్పాటు చేయాలని కోరితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని అరుణ విమర్శించారు. వనపర్తి జిల్లా కోసం 18 మండలాల ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. వనపర్తిని జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అక్కడ నిరంజన్‌రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు. అన్ని సౌకర్యాలు, భౌగోళిక సౌలభ్యం, చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాలను జిల్లాను చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారన్నారు. జనగామను జిల్లా చేస్తామన్న కేసీఆర్ ఎందుకు మోసం చేశారని పొన్నాల ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటులో విధివిధానాలు, పారదర్శకత, శాస్త్రీయత ఏమీ లేవన్నారు.