
నేడు కార్మిక సంఘాల సదస్సు
విజయవాడ(గాంధీనగర్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా స్థాయి సన్నాహాక సదస్సు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాలు నాయకులు తెలిపారు. సన్నాహక సదస్సు కరపత్రాలను గురువారం దుర్గాపురంలోని సీఐటీయూ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు విడుదల చేశారు. ముజఫర్ అహ్మద్(సీఐటీయూ), రంగనాయకులు (ఏఐటీయూసీ), బి.వెంకటసుబ్బయ్య(ఐఎన్‌టీయూసీ), పి.ప్రసాదరావు (ఇఫ్టూ), ఆర్.అజయ్‌కుమార్(బెఫి) పాల్గొన్నారు. సన్నాహక సదస్సును హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సదస్సులో అఖిల భారత కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సమ్మె ప్రాధాన్యతను వివరిస్తారన్నారు.