నేటితో ముగియనున్న అంత్య పర్వం
నేటితో ముగియనున్న అంత్య పర్వం
Published Thu, Aug 11 2016 12:49 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
పుష్కరుడి వీడ్కోలు సంబరానికి సీఎం
ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
పదకొండోరోజు పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తులు
సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి నదీతీరంలో 11 రోజులపాటు ఉత్సవంలా సాగిన అంత్యపుష్కరాలకు గురువారంతో తెరపడనుంది. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో హారతి కార్యక్రమం అనంతరం అంత్యపుష్కరాలు ముగియనున్నాయి. ముగింపు రోజు పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పదో రోజు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ రాత్రి ఏడు గంటల వరకు 51వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఘాట్ వద్ద కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది. జిల్లా మొత్తంమీద 85,652 మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. అంతర్వేది, అయినవిల్లి, జొన్నాడ, కోటిపల్లి తదతర ఘాట్లకు భక్తులు వెళ్లారు. ఉభయ గోదావరితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల యాత్రికులు తరలివచ్చారు. చివరిరోజు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఒడిసా భక్తుల తాకిడి పెద్దగా లేదు. పూరి జగన్నాథ రథయాత్ర అంత్యపుష్కరాలకు ముందే జరగడంతో ఒడిసా నుంచి భక్తులు పెద్దగా రాలేదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. జగన్నాథ రథయాత్ర ముగియడంతో అంత్యపుష్కరాలు కూడా ముగిసినట్లుగా వారు భావిస్తారని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రాజకుమారి ఘాట్ల వద్ద భద్రను పరిశీలించి సిబ్బందికి సూచన లిచ్చారు. కంట్రోల్ రూమ్ నుంచి నోడల్ అధికారి ఘాట్లలో ఏర్పాట్లును పర్యవేక్షించారు.
ఘనంగా ముగింపు వేడుకలు...
అంత్యపుష్కరాలను ఘనంగా ముగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ నుంచి పుష్కరఘాట్ వరకు చిన్నారులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్కరఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి హారతి కార్యక్రమం అనంతరం 108 మంది ముల్తైదువులు నదిలో దీపాలను వదిలి పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేవాదాయ శాఖ తరఫున జిల్లాలోని అనవ్నవరం, అయినవిల్లి పుణ్య క్షేత్రాల ప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంచిపెట్టనున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. ఇందుకోసం పుష్కరఘాట్ బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యంత్రాంగం అప్రమత్తం
ముగింపు వేడుకలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతోపాటు సీఎం చంద్రబాబు వస్తుండడంతో పుష్కరఘాట్ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు రాకపోకలకు ప్రత్యేక మార్గాలను నిర్ణయించారు. గురువారం సాయంత్రం హారతి కార్యక్రమానికి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయకుమార్, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. హారతి కార్యక్రమానికి మేయర్ పంతంరజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు.
Advertisement
Advertisement