నేడు తేలనున్న నల్లగొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి?  | Trs Party Declares Nalgonda Mp Candidate Today | Sakshi
Sakshi News home page

నేడు తేలనున్న నల్లగొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి? 

Published Thu, Mar 21 2019 3:25 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

Trs Party Declares Nalgonda Mp Candidate Today - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపనున్నారో ఇంకా గోప్యంగానే ఉంది. ఆ పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. హోలి పండుగ సందర్భంగా గురువారం తమ మిగతా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని అంటున్నారు. అదేగనుక నిజమైతే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ పడనున్నారో తేలిపోతుంది.

ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడు స్థానాలే మిగిలి ఉన్నాయి. ఆ మూడింటిలో నల్లగొండ ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండనుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పటి దాకా ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నా.. నేరుగా టీఆర్‌ఎస్‌తో సంబంధాలు లేకపోవడం, ఒకేసారి అభ్యర్థిగా తెరపైకి రావడం, స్థానిక పరిస్థితుల వల్ల గెలవలేకపోయారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై విజయం సాధించారు. కొన్నాళ్లకు గుత్తా సుఖేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, ఈ ఎన్నికల విషయానికి వచ్చే సరికి సిట్టింగ్‌గా ఉన్న గుత్తాకు టికెట్‌ ఇంకా ఖరారు కాలేదు.  

చర్చలోకి.. కొత్త పేర్లు 
శాసనసభ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోనే ఏకంగా ఆరు చోట్ల విజయం సాధించింది. దీంతో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ దక్కితే చాలు.. తేలిగ్గా గెలవచ్చన్న అభిప్రాయానికి పార్టీ నాయకులతోపాటు, బయటి వ్యక్తులూ భావించారు. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ టికెట్‌కు ఒకింత పోటీ ఎక్కువైందని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.

ఆయన స్థానిక సంస్థల మండలి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఇప్పుడు నల్లగొండ ఎంపీ టికెట్‌ కూడా ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కంచర్ల కృష్ణారెడ్డి .. తదితర పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యలోనే పార్టీతో ఎలాంటి సంబంధం లేని తటస్థుడిగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త వేమిరెడ్డి నర్సింహారెడ్డి టికెట్‌ ఆశిస్తూ పార్టీ నాయకత్వం వద్ద ప్రయత్నాలు కూడా సాగించారు. అయితే, పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఇప్పటి దాకా ఎటూ తేల్చలేదు. 

తెరపైకి సిట్టింగ్‌ ‘గుత్తా’ పేరు 
కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిగా హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఈ స్థానంనుంచి బలమైన అభ్యర్థినే పోటీకి పెట్టాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఉందని అంటున్నారు. దీంతో కొత్తవారికి టికెట్‌ ఇచ్చి ప్రయోగం చేయడమా..? లేదంటే ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన సీనియర్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని పోటీకి నిలబెట్టడమా..? అన్న చర్చ పార్టీలో జరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంగానే సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిందని చెబుతున్నారు.

అయితే, ఇప్పటి దాకా గుత్తా తాను ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తానని కానీ, చేయనని కానీ స్పష్టం చేయలేదు. పార్టీ అధినేత తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మంత్రివర్గంలో చేరతారని, పార్టీ మారిన సమయంలో అధినేత కేసీఆర్‌ అదే హామీ ఇచ్చారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి దాకా ప్రకటించ లేదా అన్న చర్చ కూడా ఉంది. తాజా పరిణామాలు, కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత నల్లగొండ నుంచి గుత్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుత్తాకు టికెట్‌ ఇస్తారా..? ఈ స్థానం నుంచి మరెవరైనా పార్టీ నేతకు అవకాశం ఇస్తారా..? కొత్తవారిని పోటీ చేయిస్తారా..? అన్న ప్రశ్నలకు గురువారం సమాధానం లభించనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement