నేడు రాజయ్య నామినేషన్
♦ రాజయ్యకు బి-ఫారం అందించిన ఉత్తమ్‌కుమార్
♦ మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన సిరిసిల్ల రాజయ్యకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం బి-ఫారం అందించారు. రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ జిల్లా నేతలు, స్థానిక ముఖ్యులతో కలసి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగానే జరపనున్నారు. పోటీలో ఉండే మిగిలిన పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని బట్టి మరోసారి అట్టహాసంగా చేయాలని టీపీసీసీ భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు: ఉత్తమ్
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధిచెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాజయ్యకు బి-ఫారం అందించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులను, నిరుద్యోగులను, విద్యార్థులను, అన్నివర్గాల ప్రజలను టీఆర్‌ఎస్ మోసం చేసిందన్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధరలేదని, ధర అడిగితే రైతులపై పోలీసులు లాఠీలతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమంలో ఉన్న శ్రుతిని కిరాతంగా ఎన్‌కౌంటర్ పేరిట హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రుణమాఫీ పేరిట, ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. వరంగల్‌లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని, జయశంకర్ స్మారక పార్కు అని చెప్పిన సీఎం ఇప్పటిదాకా పట్టించుకోలేదని విమర్శించారు. అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన ఎంపీగా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో వరంగల్ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌తో విద్యార్థుల భేటీ
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు వరంగల్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తామని విద్యార్థి, ఓయూ జేఏసీ నేతలు ప్రకటించారు. వారు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని గాంధీభవన్‌లో కలిశారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని విద్యార్థి జేఏసీ నేతలు చెప్పారు. విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ అవమానించారన్నారు. విద్యార్థులు, యువకులు పరి పక్వత లేనివారంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఉపఎన్నికలో బుద్ధి చెబుతామని హెచ్చరిం చారు. విద్యార్థి జేఏసీ నేతలు మానవతారాయ్, సి.శ్రీధర్‌గౌడ్, ఏడుకొండలు, బొజ్జ కిరణ్‌కుమార్, కొండా గణేశ్, సుఖేందర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.