రేపటి నుంచి ఆర్జిత సామూహిక అభిషేకాలు
శ్రీశైలమహాక్షేత్రంలో భక్తుల ర ద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీ మల్లికార్జునస్వామివార్లకు ఆర్జిత సామూహిక అభిషేకాలను ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తున్నారు.
· ప్రతిరోజూ 6 విడతలుగా అభిషేకాలు
· ఒక్కొక్క విడత120 టికెట్లకు అనుమతి
· అభిషేక మంత్ర జలం స్వామివార్ల మూర్తికి సమర్పణ
శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలో భక్తుల ర ద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీ మల్లికార్జునస్వామివార్లకు ఆర్జిత సామూహిక అభిషేకాలను ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తున్నారు. గతంలో సామూహిక అభిషేకాల నిర్వహణపై భక్తుల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈసారి పకడ్బందీగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దేవస్థానం వైదిక కమిటీతో చర్చించిన అనంతరం శ్రీశైల జగద్గురు పీఠాధిపతి సూచనలు,సలహాల కనుగుణంగా ఈ ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శుక్రవారం రాత్రి తెలిపారు. అభిషేక సేవాకర్తలకు స్వామివారి స్పర్శదర్శనం కూడా కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
6విడతలుగా సామూహిక అభిషేకాలు
సామూహిక అభిషేకాలను ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతిసేవలు ముగిసిన తరువాత నుంచి స్వామివార్ల నిత్య కల్యాణ మండపంలో ప్రారంభమవుతాయి. అభిషేక నిర్వహణలో భాగాంగా ఉదయం 6.30గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు 6 విడతలుగా చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5 విడతలు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు ఒక విడత మొత్తం మీద ప్రతి విడతలకు 120 టికెట్లు చొప్పున ఆరు విడతలలో సేవాకర్తలను అనుమతిస్తారు.
ఇప్పటి వరకు గర్భాలయంలో జరిగే అభిషేకాలు తీరు 2,3 నిమిషాల వ్యవధిలోనే ముగస్తుండడంపై భక్తులలో అసంతప్తి నెలకొంది. అందుచేత శాస్త్ర, సంప్రదాయరీతిలో మల్లన్నకు అభిషేకం చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు ఈఓ తెలిపారు.
ముందే చెప్పిన ‘సాక్షి’
స్వామివార్లకు సామూహిక అభిషేకాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసిన విషయాన్ని సాక్షి ముందే చెప్పింది. ‘సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం’ అనే శీర్షికతో జూలై 26న సాక్షి కథనం ప్రచురించింది.