‘డ్రంకని’ డ్రైవర్లు!
- పోలీసుల స్పెషల్ డ్రైవ్‌ను తప్పించేందుకు సరికొత్త దందా
- ‘మందుబాబు’ల వాహనాలను అటు నుంచి ఇటు దాటిస్తూ వందల్లో వసూలు
సాక్షి, హైదరాబాద్: ఏదో పబ్బులోనో, పార్టీలోనో ఫుల్లుగా మందేసి రయ్యిన కార్లో దూసుకుపోతున్నారు.. కొద్దిదూరంలో పోలీసులు.. ‘డ్రంకెన్ డ్రైవ్’ జరుగుతోంది.. ఠక్కున ఆగిపోయారు.. దొరికితే భారీగా జరిమానా, జైలు శిక్షలు, సామాజిక కార్యక్రమాలు.. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కారు వద్దకు వచ్చాడు. డబ్బిస్తే ‘డ్రంకెన్ డ్రైవ్’ దాటేదాకా కారు నడుపుతానంటూ ఆఫర్ ఇచ్చాడు. పోలీసుల తనిఖీ దాటేదాకా కారు నడిపి, వెళ్లిపోయాడు. జస్ట్ నాలుగైదు నిమిషాల కోసం వందల రూపాయలు తీసుకున్నాడు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ వంటి పెద్ద నగరాల్లో జరుగుతున్న సరికొత్త దందా ఇది.. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పేందుకు పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల నుంచి మందుబాబుల్ని తాత్కాలికంగా గట్టెక్కించేందుకు ఇలా అద్దె డ్రైవర్లు పుట్టుకువస్తున్నారు.
కొంతకాలంగా కోర్టులు మందుబాబులకు జరిమానా, జైలు శిక్షలతో పాటు రోడ్లు ఊడ్చడం, తాగి నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేయించేలా ఆదేశాలు ఇస్తున్నాయి. దీంతో మందుబాబులకు స్పెషల్ డ్రైవ్ అంటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అద్దెడ్రైవర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ ‘అద్దె డ్రైవర్లు’ పోలీసులు తనిఖీ చేపట్టే చోట్ల వాలిపోతున్నారు. చెక్ పాయింట్‌కు అటు, ఇటు కొన్ని మీటర్ల దూరం మందుబాబుల వాహనాలను నడుపుతూ సాగనంపుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా మందుబాబుల నుంచి వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. మందుబాబులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్న ఈ వ్యవహారం.. వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలకూ విస్తరిస్తోంది. దీంతో మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.