
పరీక్షల సమయంలో ట్రాఫిక్ మళ్లింపా..!?
కుమ్మరిపాలెం వద్ద వాహనదారుల ఇక్కట్లు
భవానీపురం (విజయవాడ పశ్చిమం) : ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు సరికాదని ప్రజలు పేర్కొంటున్నారు. దుర్గగుడి టోల్‌గేట్ నుంచి విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వరకు జాతీయ రహదారి మరమ్మతుల సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుంచి నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ క్రమంలో వన్‌టౌన్, టూటౌన్ వెళ్లాల్సిన గట్టు వెనుక ప్రాంతంలోని వాహనదారులను కుమ్మరిపాలెం వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు సొరంగ మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
కనీసం ద్విచక్రవాహనాలను కూడా అనుమతించకపోవడంతో వాహనచోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్ వెళ్లాల్సిన అంబులెన్స్‌ను కూడా పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్సు సకాలంలో ఆస్పత్రికి చేరక, రోగి ప్రాణాలకు ఏమైనా ఆపద ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. త్వరలో ఇంటర్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
చుట్టూ తిరిగి వెళ్లే సమయంలో సొరంగం వద్ద ట్రాఫిక్ స్తంభించి, విద్యార్థలు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరకుంటే వారి పరి స్థితి ఏమిటా అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్ పరీక్షల తరువాత 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమవుతాయని, వారు కూడా అవస్థల పడకతప్పేలా లేదని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపు కారణంగా సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుతామో లేదోనన్న ఆందోళనతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు ట్రాఫిక్ మళ్లింపుపై పునరాలోచన చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.