అమీర్‌పేట కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
⇒ ‘మెట్రో’ పనుల నేపథ్యంలో అమీర్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
⇒ బుధవారం నుంచి వచ్చే మంగళవారం వరకు అమలు
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాల నేపథ్యంలో నగరంలోని అమీర్‌పేట బిగ్‌బజార్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు అమలులో ఉండే వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు దారులు ఇవే..
⇒ ఖైరతాబాద్, పంజగుట్ట వైపు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ ‘టి’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లడానికి అనుమతించరు. వీటిని బిగ్‌బజార్ వెనుక వైపు నుంచి పంపిస్తారు.
⇒ కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ వైపుల నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను (భారీ వాహనాల మినహా) జీహెచ్‌ఎంసీ పార్క్, శ్రీనగర్‌కాలనీ క్రాస్‌రోడ్, పార్క్ వ్యూ జీఎస్ కన్‌స్ట్రక్షన్స్ బిల్డింగ్, గౌతమ్ చికెన్ సెంటర్, ఇమేజ్ హాస్పటల్ లైన్ మీదుగా పంపిస్తారు.
⇒ ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట వైపు నుంచి ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళే వాహనాలను బిగ్‌బజార్ నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ వరకు ఒకే మార్గంలో రెండు వైపులకూ వెళ్లే వాహనాలను అనుమతిస్తారు.
⇒ ఈ మళ్లింపుల ప్రభావం సిటీ బస్సు రూట్ నంబర్లు 218, 225, 9, 9 ఎం, 9 ఎక్స్, 9/ఎఫ్, 189 ఎం, 19/ఎఫ్, 158, 113, 19 జే, 19 ఎం, 185, 19 కె/జె రూట్ బస్సులపై ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ జితేందర్ తెలిపారు.