‘విషాద’యాత్ర
► కుంటాల జలపాతంలో అర్గుల్ వాసుల గల్లంతు
► గ్రామంలో విషాద ఛాయలు
జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌రూరల్): విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకొనే క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కుంటాల జలపాతంలో పడి గల్లంతయ్యారు. జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన అన్సారి, ఫైజాన్ (21) రాజు, సాయిరాం, నరేశ్ స్నేహితులు. అన్సారీ బైక్ మెకానిక్‌గా పని చేస్తుండగా, ఫైజాన్ ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నాడు. ఐదుగురు మిత్రులు కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని అతి ఎత్తయిన కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఆదివారం కారులో బయల్దేరారు. జలపాతం వద్ద సెల్ఫీలు తీసుకొనే క్రమంలో అన్సారీ, ఫైజాన్ నీటిలోకి దిగారు. ఈ క్రమంలో జారిపడి గల్లంతయ్యారు.
ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అర్గుల్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్గుల్ నర్సయ్య ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఫోన్‌లో మాట్లాడి, వివరాలు తెలిపారు. గల్లంతైన యువకుల ఆచూకీ కనిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, అర్గుల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.