రెండో రోజు కొనసాగిన ట్రయల్‌రన్
- సక్సెస్ కావడంతో అధికారుల్లో సంతోషం
పగిడ్యాల: జీఓ నంబరు 3కు ప్రత్యామ్నాయంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నికర జలాలను వినియోగించుకునేందుకు ముచ్చుమర్రి వద్ద రూ. 75 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్ రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3, 4 మోటార్లను రన్ చేసి కృష్ణా జలాలను కేసీ కాలువలోకి రప్పించారు. నవంబర్ 30న నిర్వహించాల్సిన ట్రయల్‌రన్ మోటార్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. ఆ లోపాన్ని గుర్తించేందుకు కాంట్రాక్టర్‌లు దాదాపు పదిహేను రోజులుగా శ్రమించారు. మోటార్‌లను సరఫరా చేసిన బీహెచ్‌ఎల్ కంపెనీకి చెందిన టెక్నికల్ ఇంజనీర్లు రోటర్‌లో ఉండే త్రైస్టర్ వైర్ పనిచేయడం లేదని గుర్తించి భోపాల్ నుంచి తెప్పించి అమర్చడంతోనే ట్రయల్‌రన్ సక్సెస్ అయినట్లు ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. అయితే బుధవారం ఎమ్మెల్యే వై. ఐజయ్య పనులు పరిశీలించి వెళ్లడం కొంత వరకు మేలు జరిగిందని సైట్ మేనేజర్ రాముడు తెలిపారు. ట్రయల్‌రన్ నిర్వహణ కోసం అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి బాగా ఒత్తిడికి లోనయ్యామని వరుసగా 3, 4 మోటార్లు పనిచేయడం ఆనందంగా ఉందని అధికారులు, సాంకేతిక సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి, ఏఈలు, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.