కూడెడ్తావనుకుంటే.. కాటికెళ్లావా..
– ట్రైనీ ఎస్‌ఐ కిరణ్ ఆత్మహత్యతో మిర్యాలగూడలో విషాదం
– మిన్నంటిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు
– ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్న ఎస్పీ
‘‘కోరుకున్న ఉద్యోగానికి అర్హత సాధించానని సంబరపడ్డావు.. ఇక కష్టాలన్నీ తీరాయంటివి.. అమ్మా బాగా చూసుకుంటానని చెబితివి.. ముసలితనానికి ఇంత ముద్ద పెడతావనుకుంటే.. నువ్వే కాటికెళ్లావా కొడుకా’’ అంటూ ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోస్టింగ్ ఇవ్వలేదని మనస్తాపంతో తమ్మడబోయిన కిరణ్ బలవన్మరణానికి పాల్పడడంతో మిర్యాలగూడ పట్టణంలో విషాదం అలుముకుంది. అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
– మిర్యాలగూడ, మిర్యాలగూడ అర్బన్
మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన మణెమ్మకు అర్జున్, కిరణ్ ఇద్దరు కుమారులు. భర్త చనిపోవడంతో కష్టపడి పిల్లలను పెంచింది. చిన్నతనం నుంచి రవి చదువులో బాగా రాణించేవాడని, కష్టపడి ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తానని చెబుతుండేవాడని స్థానికులు పేర్కొన్నారు.
కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐగా..
కిరణ్ మొదట్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే రైల్వే ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు.ఆ శిక్షణ పొందుతున్న సమయంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. దాంతో రైల్వే ఎస్‌ఐగా శిక్షణను వదులుకుని సివిల్ ఎస్‌ఐ శిక్షణకు వెళ్లాడు. శిక్షణ పూర్తి కాగానే ఎస్‌ఐగా పోస్టింగ్ వస్తుందని భావించాడు. అంతే కాకుండా ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్ ఎస్‌ఐ శిక్షణలో ఉన్న సమయంలో ఏడాదిన్నర క్రితం సూర్యాపేటకు చెందిన కల్యాణితో వివాహం జరిగింది. కిరణ్ భార్య కళ్యాణి డెలివరీ కోసం వెళ్లి బాబు పుట్టిన తర్వాత ఐదు నెలలుగా అక్కడే ఉంది.
కన్నీరుమున్నీరవుతున్న బంధువులు, స్నేహితులు:
కిరణ్ మృతి వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు రవీంద్రనగర్‌కు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.సూర్యాపేటలో ఉన్న భార్య కళ్యాణి తన ఐదు నెలల బాలుడిని తీసుకుని మిర్యాలగూడకు చేరుకుంది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు
ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని సందర్శించారు. రూరల్ సీఐ రవీందర్, ఎస్‌ఐ సర్ధార్‌నాయక్, వన్‌టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ వచ్చి కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి సోదరుడు తమ్మడబోయిన అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ రవీందర్ తెలిపారు.