డెబిట్‌కార్డులతోనే లావాదేవీలు
ప్రతి షాపులోనూ ఈపాస్ మిషన్ ఉండాల్సిందే
– వ్యాపారులు కరెంట్ ఖాతాలు ప్రారంభించి ఈపాస్ యంత్రాలు పొందాలి
– నేటి నుంచి ఉద్యమంగా డెబిట్‌కార్డుల పంపిణీ
– విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయకుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి దుకాణంలో ఈపాస్ మిషన్, ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డు ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రకటించారు. రానున్న 10–15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి అన్ని రకాల లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించడానికి కార్యచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిమాణాలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎరువులు, కిరాణం షాపులు, చౌక ధరల దుకాణాలు తదితరాలన్నీ 23వేలకు పైగా ఉన్నాయని, వీటన్నింటిలోనూ బ్యాంకుల ద్వారా ఈపాస్ మిషన్లను ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు çప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి పది వేల ఈపాస్ మిషన్లు సరఫరా చేసేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని, ఎస్‌బీఐ 2వేలు, ఎస్‌బీహెచ్, సిండికేట్ బ్యాంకు ఒక్కొక్కటీ వెయ్యి ప్రకారం ఈపాస్ మిషన్లు సరఫరా చేస్తామని ప్రకటించాయన్నారు. అన్ని రకాల వ్యాపారులు బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలను ప్రారంభించి రూ.50 వేలు డిపాజిట్ చేస్తే బ్యాంకులు కొత్త నోట్లు రూ.50 వేలు ఇస్తాయని, దీని ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. డెబిట్ కార్డులు వాడకం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయని, జీరో వ్యాపారానికి అవకాశం ఉండదన్నారు. ప్రతి మండలంలో ఎంపీఈఓలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, డీఆర్‌డీఏలకు చెందిన 20 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని, వీరి ద్వారా ఆదివారం నుంచి ప్రజలందరికీ డెబిట్‌కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇతరుల డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఖాతాల్లో వేసుకొని ఇబ్బంది పడవద్దని ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2000 నుంచి 2500 మందిని బిజినెస్ కారస్పండెంట్లను నియమించి వారి ద్వారా బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తామన్నారు. ఒకటో తేదీ నుంచి మొదలయ్యే ప్రజాపంపిణీ సైతం నగదు రహితంగా ఈపాస్‌ల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.