* జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీల్లో లాబీయింగ్
* జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించడంపై తీవ్ర గందరగోళం
* 10 శాతం కూడా బదిలీకి అనర్హులే
* జీజేఎల్‌ఏ ప్రతిపాదించిన తేదీని కటాఫ్‌గా నిర్ణయించడంపై ఆగ్రహం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ లెక్చరర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఐదేళ్లు సర్వీసు పూర్తై లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సర్వీసు కటాఫ్ తేదీని జూన్ ఒకటో తేదీగా నిర్ణయించడంతో ఫలితం లేకపోయింది.
2011 సంవత్సరంలో జరిగిన బదిలీల్లో దాదాపు 70 శాతం మందికి స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం వారి సర్వీసు నాలుగు సంవత్సరాల 11 నెలల పది రోజులు. దీంతో వారందరూ బదిలీ నుంచి విముక్తి పొందుతారు. కేవలం 5 నుంచి 10 శాతం మంది కూడా బదిలీకి అర్హులు కావడంలేదు. వీరంతా 20 శాతం హెచ్‌ఆర్‌ఏ, మంచి స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థానం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది.
జూన్ ఒకటి కటాఫ్ తేదీ కోసం లాబీయింగ్..
2011 నుంచి 2015వ తేదీ వరకు జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీలు జరిగాయి. అయితే ఎప్పుడూ జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించలేదు. ప్రతిసారీ జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించి ఐదేళ్లు పూర్తైవారిని కచ్చితంగా బదిలీ చేసేవాళ్లు. 3 ఏళ్ల సర్వీసు పూర్తై వారిని రిక్వెస్టు బదిలీ కింద పరిగణించేవారు.
2013లో మే 31న జనరల్ జీఓ ఇచ్చినా అప్పుడూ కూడా జూన్ 30వ తేదీనే కటాఫ్‌గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం కొందరు ప్రయోజనాల కోసం ఓ సంఘం తీవ్ర లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఆ సంఘం వినతి మేరకు ఇంటర్ బోర్డు అధికారులు జూన్ ఒకటికి బదులు జూన్ 30వ తేదీని కటాఫ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే..
మరోవైపు జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే దాదాపుగా 70 శాతం మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 500 మందికి స్థాన చలనం కలుగుతుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు మరో ఐదేళ్లు అక్క డే పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు కోరుతున్నారు.
360 మందికి బదిలీ నుంచి విముక్తి
జోన్-4లో దాదాపుగా 800 మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పని చేస్తున్నారు. 2011లో జూన్ 30వ తేదీని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్‌గా తీసుకొని దాదాపుగా 400 మందిని బదిలీ చేశారు. వీరందరూ జూన్ 10-15 తేదీల మధ్య రిలీవ్ అయి కొత్త స్థానాల్లో కొలువు దీరారు. ఇందులో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారే అధికం.
వీరిలో కొందరు అక్కడి నుంచి బదిలీ కాకుండా ఉండేందుకు ఓ సంఘంతో కలసి లాబీయింగ్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి కావడంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కారణంతో బదిలీ కాకుండా ఉండేందుకు ఎప్పుడూ లేని విధంగా కటాఫ్ తేదీనే మార్పించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్ తేదీగా నిర్ణయించడంతో జోన్-4లో దాదాపుగా 360 మందికి బదిలీ నుంచి విముక్తి లభిచించింది. కర్నూలులో జిల్లాలో కేవలం 12 మంది మాత్రమే బదిలీ అవకాశముంది. కడపలో 8 మందికి, చిత్తూరులో 15 మందికి, అనంతపురంలో 11 మందికి కచ్చిత బదిలీ కానున్నది.
84 మంది దరఖాస్తు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 84 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డీవీఈఓ డీసీ కబీరు తెలిపారు. వీరిలో కచ్చితంగా బదిలీ కావాల్సిన వారు 19 మంది ఉన్నారన్నారు. రిక్వెస్టు బదిలీల కోసం మొత్తం 65 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందులో ప్రిన్సిపాళ్లు ఐదుగురు, లెక్చరర్లు 46 మంది, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, టైపిస్టు ఒక్కరు, రికార్డు అసిస్టెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు ఇద్దరు ఉన్నారు. ఇందులో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు ఈనెల 30న కడప ఆర్‌జేడీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుంద ని, అధ్యాపకేతర సిబ్బందికి డీవీఈఓ కార్యాలయంలోనే కౌన్సెలింగ్ ఉంటుందని, అయితే ఇంకా తేదీని ఖరారు చేయలేదన్నారు.
తెర వెనుక మంత్రం.. బదిలీలకు దూరం
Published Wed, Jun 29 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement