బలప్రయోగం చేస్తే ప్రాణత్యాగానికీ సిద్ధం
బలప్రయోగం చేస్తే ప్రాణత్యాగానికీ సిద్ధం
Published Wed, Nov 23 2016 11:04 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
దివీస్ బాధిత గ్రామాల ప్రజల హెచ్చరిక
కోన భూముల్లో చెట్లు తొలగింపునకు యత్నం
యంత్రాలతో భూముల్లోకి ప్రవేశించిన అధికారులు
సమైక్యంగా అడ్డుకున్న మూడు గ్రామాల ప్రజలు
తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ కోసం తమ భూముల్ని బలప్రయోగంతో లాక్కోజూస్తే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చే శారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను నేడు కాలుష్య కారక పరిశ్రమకు ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆక్రోశించారు. బుధవారం మండలంలో ప్రభుత్వం దివీస్‌కు కేటాయించిన భూముల్లో చెట్ల తొలగింపునకు అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలు, కటింగ్ యంత్రాలు, ట్రాక్టర్లతో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం బాధిత గ్రామాల ప్రజలకు విషయం తెలియడంతో పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది కలసికట్టుగా భూముల్లోకి వెళ్లారు. ప్రభుత్వానికి అమ్మని భూముల్లో, హైకోర్టు సేకరణను వ్యతిరేకించిన భూముల్లో పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల మాటలు విని వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని జనమంతా జేసీబీలు, కోత యంత్రాల సామగ్రి తెచ్చిన సిబ్బందిని హెచ్చరించారు. మరోసారి యంత్రాలతో భూముల్లోకి వస్తే ఊరుకోబోమన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరచూ రైతుల భూముల్లోకి ప్రవేశించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదేవిధంగా చెట్లను తొలగించడంతో ఆందోళన చేశామన్నారు. ప్రభుత్వం తమ భూముల వ్యవహారంపై మొండి వైఖరి వీడాలని కోరారు.
పనులు పరిశీలించేందుకు వెళ్లామంతే: తహసీల్దార్
గతంలో ప్రభుత్వం దివీస్‌కు భూములు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ అక్కడ ఏ పనులు చేస్తున్నదీ పరిశీలించేందుకు వెళ్లామని తహశీల్దార్ టి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన భూముల్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement