వీరపునాయునిపల్లె:
వీరపునాయునిపల్లెలోని బీసీ–2 వసతిగృహం వార్డెన్ దాసిరెడ్డి పనితీరుపై మంగళవారం ఆశాఖకు చెందిన పులివెందుల డివిజన్ ఏబీసీడబ్లు్యవో రోషన్న విచారణ జరిపారు. ‘తన మీద ఫిర్యాదు చేశాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్’ శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో విచారణ జరిపారు. వార్డెన్ సక్రమంగా విధులకు హాజరవుతున్నారా..లేదా..వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలవుతోందా.. అనే విషయాలను గురించి విద్యార్థులను ప్రశ్నించారు.
వసతి గృహంలో తమకు రాగిజావ, సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ప్రతి శనివారం ఇవ్వాల్సిన పాయసాన్ని కూడా తమకు ఇవ్వడం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బీసీ వసతిగృహం–1 వార్డెన్ ఇన్‌చార్జిగా ఉంటారని, మెనూ సక్రమంగా అమలవుతుందని చక్కగా చదువుకోవాలని ఏబీసీడబ్లు్యఓ విద్యార్థులకు సూచించినట్లు తెలిసింది. కాగా, విచారణకు ముందు మెనూ సక్రమంగా అమలవుతోందని అధికారులకు చెప్పాలని అక్కడి సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది.