ఏడాది కాలంలో ఎవరినైనా తరిమామా?
♦ సీమాంధ్రులను తరుముతామని విష ప్రచారం చేశారు
♦ సామరస్యంగా జీవిద్దాం: కేటీఆర్
♦ కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులను తరుముతామని విషప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో హైదరాబాద్‌లో ఒక్క సంఘటనైనా జరిగిందా? ఎక్కడన్నా శాంతి భద్రతల సమస్య తలెత్తిందా.’ అని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజకీయ నాయకులకు వాక్‌శుద్ధి కన్నా, చిత్తశుద్ధి ఎంతో ముఖ్యమన్నారు. శేరిలింగంపల్లి, వికారాబాద్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల నేతలు పలువురు సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నాయకుల చేరిక వల్ల జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ మరింత బలపడుతుందన్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఏం మాట్లాడారో, ఆ తరువాత దానికే కట్టుబడి ఉన్నారని, హైదరాబాద్ లో భవిష్యత్‌లో కూడా అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు శాంతి, సామరస్యాలతో కలిసే ఉంటారన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఓట్లు తీసేస్తున్నారని కొంత మంది చిల్లర ప్రచారం చేస్తున్నారని, కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 67 లక్షలు ఉంటే, ఓటర్లు మాత్రం 72 లక్షల మం ది ఉన్నారని మంత్రి వివరించారు. హైదరాబాద్‌కు నవంబరు కల్లా గోదావరి నుంచి 172 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మం త్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.